104 ఉద్యోగులపై వేటుకు సర్కార్‌ సిద్ధం! | Sakshi
Sakshi News home page

104 ఉద్యోగులపై వేటుకు సర్కార్‌ సిద్ధం!

Published Mon, Jan 28 2019 8:04 AM

Sakshi Special Story On 104 Employees Problems

సాక్షి, అమరావతి : 104 సంచార వైద్య శాలలు (చంద్రన్న సంచార చికిత్స) పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడంతో ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 104లో పనిచేస్తున్న 1642 మంది సమ్మెకు దిగారు. సమస్యలు పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేశారని, విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగినట్టు సిబ్బంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారిపై వేటు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఈ నెల 25న వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్టు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 104 వాహనాల నిర్వహణను పిరమిల్‌ స్వాస్థ్య సంస్థ చూస్తోంది. ఈ సంస్థకు మూడేళ్ల వ్యవధికి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. వచ్చే మార్చితో ఈ వ్యవధి ముగుస్తుంది. అప్పుడు తిరిగి టెండర్లు నిర్వహించి నిర్వహణ సంస్థతో పాటే సిబ్బందినీ మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. ఉద్యోగులంతా 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 104 పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి పనిచేస్తున్నవారే. గత నాలుగున్నరేళ్లుగా 104 సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం, ప్రశ్నించినవారిని బదిలీ చేయడం, తొలగించడం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ గత కొంతకాలంగా సిబ్బంది పోరాడుతూనే ఉన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సిబ్బంది సమ్మె చేస్తున్నారు.

మందులు అందక రోగుల ఇబ్బందులు
ఈ నెల 22 నుంచి సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో 292 వాహనాలు గ్రామాలకు వెళ్లడం లేదు. దీంతో లక్షలాది మంది వృద్ధులు, గర్భిణులు, బాలింతలు మందులు అందక ఇబ్బందులు పడుతున్నారు. వీరేకాకుండా మధుమేహం, మూర్చ, రక్తపోటు, హైపర్‌టెన్షన్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్న మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మందులు అందడం లేదు. దీంతో వారంతా అల్లాడుతున్నారు.

కార్పొరేట్‌ సంస్థకు ఏడాదికి రూ.85.44 కోట్లు
ప్రభుత్వం 104 సిబ్బందికి వేతనాలు సరిగా ఇవ్వకపోయినా, రోగులకు మందులివ్వకపోయినా తూతూమంత్రంగా వాహనాలను తిప్పుతున్న పిరమిల్‌ స్వాస్థ్య సంస్థకు మాత్రం ఏడాదికి రూ.85.44 కోట్లు చెల్లిస్తోంది. ఒక్కో వాహనానికి నెలకు రూ.2.44 లక్షలు ఇస్తోంది. అంటే నెలకు రూ.7.12 కోట్లకు పైగా చెల్లిస్తోంది. మూడేళ్ల కాంట్రాక్టులో భాగంగా నిర్వహణ సంస్థకు ప్రభుత్వం చెల్లించింది అక్షరాలా రూ.256.32 కోట్లు. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా నిర్వహణ సంస్థకు మాత్రం భారీగా లబ్ధి చేకూర్చింది. చివరకు ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ చెల్లించకుండా సంస్థ నిర్లక్ష్యం వహించినా సర్కారు పట్టించుకోకపోవడం వల్లే పోరాటాలకు దిగాల్సి వచ్చిందని సిబ్బంది చెబుతున్నారు. స్వయానా ముఖ్యమంత్రే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

104లో సిబ్బంది వివరాలు ఇలా.. 
కేడర్‌                         ఉద్యోగుల సంఖ్య
నర్సు/ఏఎన్‌ఎంలు                321
ఫార్మసిస్టులు                      321
ల్యాబ్‌ టెక్నీషియన్లు             320
డ్రైవర్లు                              326
వాచ్‌మెన్లు                        165
డాక్టర్లు                            189

Advertisement
Advertisement