
సాక్షి, అమరావతి : వలస బాధితుల తరలింపు కోసం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసించారు. వలస కూలీలను ఆదుకోవడంతో సీఎం జగన్ ప్రభుత్వం గొప్ప మానవతా దృక్పధాన్ని చాటుతోందని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.
(చదవండి : ఆయన ఎప్పటికీ మారరు : సజ్జల)
‘రాష్ట్రాలను దాటుకుంటూ సుదీర్ఘ దూరం వెళ్తున్న వలస కూలీలను ఆదుకోవడంలో సీఎం జగన్ ప్రభుత్వం గొప్ప మానవతా దృక్పధాన్ని చాటుతోంది. రాష్ట్రంలో ఉన్న వలసకూలీలను శ్రామిక్ రైళ్లు, బస్సుల్లో పంపిస్తోంది. అంతే కాకుండా ఒక్కొక్కరి చేతిలో రూ.500 పెట్టాలని నిర్ణయించింది’ అని సజ్జల ట్వీట్ చేశారు.
‘వలస కూలీలెవరూ ఆకలి బాధకు గురికాకుండా వారికోసం రహదారుల వెంబడి భోజనం, తాగునీరు ఏర్పాటు చేసింది. ఇలా రోడ్డు వెంబడి నడుస్తూ కనిపించే వారిని సురక్షితంగా చేర్చడానికి వచ్చే 15 రోజులు ఉచితంగా బస్సులు కూడా నడపాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు’ అని సజ్జల పేర్కొన్నారు.