మేనిఫెస్టో అమలు దిశగా

Sajjala Ramakrishna Reddy Comments On YS Jagan Govt - Sakshi

తొలి ఏడాది విజయవంతమైన పాలన 

ప్రజలకు సమస్యలు లేని జీవితమే జగన్‌ లక్ష్యం 

తొలి ఏడాదిలోనే 90 శాతం హామీల అమలు పూర్తి 

పార్టీ మేనిఫెస్టోలో లేనివి కూడా 40 శాతం అమలు 

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించిన తొలి ఏడాదిలో ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయడంలో కృతకృత్యులయ్యారని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సమస్యలు లేని జీవితాన్ని ప్రజలకు ప్రసాదించడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారని చెప్పారు. పార్టీ విజయం సాధించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. 

► జగన్‌ పాలనలో తొలి అంకం పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన సమీక్షించుకుని మళ్లీ రెండో ఏడాదిలో ప్రజలకు ఏం చేయబోతున్నారో క్యాలెండర్‌ను విడుదల చేశారు.  
► గత ఏడాది సరిగ్గా ఇదే రోజున సాధించిన ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి జగన్‌ కృషి ఎంతగానో ఉంది.  
► 2014 ఎన్నికల్లో అధికారం చేతికి అందినట్లే చేజారినప్పటికీ ఏ మాత్రం చలించకుండా  ఐదేళ్ల పాటు మళ్లీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి జగన్‌ ముందుకు నడిపించారు.  
► ప్రజా సమస్యలపై లెక్కలేనన్ని పోరాటాలు చేయడంలోనూ, తానే స్వయంగా ఆమరణ దీక్షలకు పూనుకోవడంలోనూ వైఎస్‌ జగన్‌ ముందంజగా ఉన్నారు.  
► అన్నింటికీ మించి ఆయన 3,648 కిలోమీటర్ల మేరకు చేసిన పాదయాత్ర చారిత్రాత్మకమైనది. 
► వివిధ వర్గాల ప్రజలకు ఏం చేయాలో అక్కడి నుంచే జగన్‌ ఒక నిర్ణయానికి వచ్చి, అధికారంలోకి రాగానే అమలు చేయగలిగారు.  

రాజకీయం రాజకీయాల కోసం కాదు 
► రాజకీయం రాజకీయాల కోసం కాదు.. ప్రజల కోసం అనే దాన్ని ముఖ్యమంత్రి జగన్‌ గట్టిగా విశ్వసించారు. 
► అందుకే ఎన్నికలు అయిపోగానే ఇక రాజకీయం వద్దు ప్రజలకు మేలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.  
► ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరిచే విధంగా సాచ్యురేషన్‌ (సంతృప్త స్థాయి) ప్రాతిపదికగా పథకాల అమలు జరగాలని ఏ రాజకీయ పార్టీ వారు అనేది చూడరాదని వైఎస్‌ జగన్‌ అధికారులకు, యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  
► ఏడాది తిరిగేటప్పటికి మేనిఫెస్టోలో పొందుపర్చిన 90 శాతం హామీలను అమలు చేశాం. 
► ఇళ్ల స్థలాల పంపిణీ వంటివి కొన్ని మిగిలిపోయాయి.  
► ఇచ్చిన హామీల్లో లేనివి సైతం 40 శాతం దాకా అమలు చేశారు.  
► వాస్తవానికి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఇతరత్రా కూడా అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొని ఉండేవి.  
► అయినా మొక్కవోని దీక్షతో జగన్‌ అభివృద్ధి, సంక్షేమం వైపు దృష్టిని సారించారు.  
► అఖండ విజయానికి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు.  

సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలి 
వైఎస్సార్‌సీపీకి ప్రజలు అఖండమైన విజయాన్ని అందించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏడాది పూర్తయిన రోజు పార్టీ జెండా ఆవిష్కరణలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తొలుత భావించామని, అయితే కరోనా నేపథ్యంలో రాజకీయ పరమైన కార్యక్రమాలు నిర్వహించడం మంచిది కాదని, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్ట వద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ విషయాన్ని కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేశారు. పండ్లు పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేయదలిచిన వారు లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు.. ప్రత్యక్షంగా పాల్గొనకుండా బాధితులకు సంబంధించిన స్వచ్ఛంద, సేవా సంస్థల నిర్వాహకుల ద్వారా కానీ, వార్డు వలంటీర్ల ద్వారా కానీ వాటిని నిర్వహించాలని రామకృష్ణారెడ్డి వివరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top