ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులను ఆర్టీసీ సమ్మె టెన్షన్ పెడుతోంది. ఎంసెట్ రాసేం దుకు శుక్రవారం జిల్లా నలుమూలల నుంచి గుంటూరుకు రావాల్సిన...
ఆర్టీసీ బస్సులు లేక ఎదురుకానున్న రవాణా ఇబ్బందులు
నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్న అధికారులు
ఆందోళనలో విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా పరీక్ష రాయనున్న 27,617 మంది
గుంటూరు ఎడ్యుకేషన్: ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులను ఆర్టీసీ సమ్మె టెన్షన్ పెడుతోంది. ఎంసెట్ రాసేం దుకు శుక్రవారం జిల్లా నలుమూలల నుంచి గుంటూరుకు రావాల్సిన విద్యార్థులకు సమ్మె కొనసాగితే బస్సులు అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీంతో రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తనున్నాయి. నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదన్న అధికారుల ప్రకటనతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు నగరంలోని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో సమీప ప్రాంతాల విద్యార్థులకు ఇబ్బందులు ఉండకపోవచ్చు.
మాచర్ల, వినుకొండ, రేపల్లె, బాపట్ల తదితర దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు ఆటోలు, ప్రైవేటు వాహనాలే శరణ్యం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 27,617 మంది ఎంసెట్‌కు హాజరుకానున్నారు. వీరి కోసం 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. గుంటూరు నగరంలో 38, నరసరావుపేటలో 5, చిలకలూరిపేటలో ఒక కేంద్రం ఉన్నాయి. జిల్లాలోని 57 మండలాల వారీగా ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థులు నిర్దేశిత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో సాహసం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు బస్సులను ఏర్పాటు చేసి విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలిచేందుకు ముందుకు రావాల్సి ఉంది.
ఎంసెట్‌కు ముమ్మర ఏర్పాట్లు
ఆర్టీసీ సమ్మెతో విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఎదురుకానున్నాయి. అధికారులు మాత్రం ఎంసెట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజినీరింగ్ పరీక్షకు 19,878 మంది, మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షకు 7,739 మంది హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 38 కేంద్రాల్లో ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 16 కేంద్రాల్లో మెడిసిన్ పరీక్షలు జరగనున్నాయి.
విద్యార్థులను గంట ముందు నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. నిర్థిష్ట సమయానికి అరగంట ముందుగా విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ అందజేస్తామని చెబుతున్నారు. ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 2.30 తర్వాత పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు ఒక నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని తేల్చిచెబుతున్నారు.