సీఎం మీటింగ్‌కు రాకపోతే రూ.400 కట్‌

Rs 400 cut If you do not attednd to cm meeting - Sakshi

మహిళా సంఘం లీడర్లకు బెదిరింపు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యే సభకు రాకపోతే రూ.400 కట్‌ చేస్తామని డ్వాక్రా మహిళా సంఘం లీడర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఎం బుధవారం అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా రాప్తాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు డ్వాక్రా మహిళలను తరలించే ఏర్పాట్లు చేశారు. సంఘం నుంచి కనీసం ఇద్దరు రావాలని ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నారు. రాలేమని చెబుతుంటే బెదిరింపులకు దిగుతున్నారు.

అనంతపురం: సీఎం చంద్రబాబు హాజరయ్యే సభకు రాకపోతే రూ.400 కట్‌ చేస్తామని డ్వాక్రా మహిళా సంఘం లీడర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఎం బుధవారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పేరూరుకు వస్తున్నారు.

బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల సభ్యులను తరలించేందుకు అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. ప్రతి మహిళా సంఘం నుంచి కనీసం ఒకరిద్దరు కచ్చితంగా రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. రామంటే బెదిరింపులకు దిగుతున్నారు. సోమవారం అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని ఓ సంఘం లీడరుకు యానిమేటర్‌ ఫోన్‌ చేశారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.

గ్రూపు లీడరు (అంజనాదేవి): అక్కా చెప్పక్కా!
యానిమేటర్‌ (లక్ష్మీదేవి): అక్కా..పేరూరు మీటింగ్‌కు రావాలి
గ్రూపు లీడరు: అక్కా మేము రాము. మేము వైఎస్సార్‌ పార్టీవాళ్లము.  
యానిమేటరు: మీ గ్రూపులో నుంచి ఎవరైన్నా పంపు. నువ్వే రావాలని చెప్పడం లేదు.
గ్రూపు లీడరు: నేనైతే ఎవరికీ చెప్పను. రూలేమైనా ఉంటే చెప్పండి. నేను ఫాలో అవుతా.
యానిమేటరు: నువ్వ లీడరు కాబట్టి చెబుతున్నా. ఎవర్నైనా పంపు.
గ్రూపు లీడరు: నేనైతే ఎవరికీ వెళ్లమని చెప్పను. నేనైతే పక్కా వైఎస్సార్‌. పదిలక్షలు ఇస్తామంటే కూడా మీటింగ్‌కు రాను.
యానిమేటరు: అవన్నీ అనవసరం. వస్తావా రావా? మనకు రాజకీయాలు అవసరం లేదక్కా?
గ్రూపు లీడరు: మీటింగ్‌ పెడుతున్నారు కాబట్టి ఇది రాజకీయమే. రాజకీయ నాయకుల కోసమే పేరూరుకు పోతుండేది తెలుసు.
యానిమేటరు: రాజకీయం కాదు మన డ్వాక్రా వాళ్ల కోసమే సారు బస్సు పంపిస్తున్నాడు.
గ్రూపు లీడరు: సారు నంబరు నాకివ్వు. నేను ప్రెస్‌వాళ్లను పిలిపించి మాట్లాడతా. ఏళ్ల నుంచి గ్రూపులో ఉన్నా రుణమాఫీ కాలేదు. అవన్నీ తీర్చితే ఎన్ని బస్సులకు కావాలంటే అంతమందిని ఎక్కిస్తానని చెబుతా.
యానిమేటరు: నువ్వు వస్తేరా లేదంటే లేదు.రాకపోతే రూ.400 కట్‌ చేస్తా.
గ్రూపు లీడరు: మీటింగ్‌కు పోకపోతే సంఘంలో 400 కట్‌ చేస్తారా? సరే చేయండి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top