పోలీస్‌ దాదా.! | rowdy police doing a collections and settlements | Sakshi
Sakshi News home page

పోలీస్‌ దాదా.!

Oct 27 2017 12:08 PM | Updated on Aug 21 2018 6:00 PM

rowdy police doing a collections and settlements - Sakshi

సాక్షిప్రతినిధి, విజయనగరం: పోలీస్‌ శాఖలోని వారంతా సేవా భావం అలవర్చుకోవాలనీ... ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని వారి పెద్ద బాస్‌ ఎప్పటికప్పుడు హితవు పలుకుతున్నారున. కానీ అవేవీ తాము లెక్కచేయక్కరలేదని కొందరు తమ పంథాలోనే నడుస్తున్నారు. వారిలో ఎస్‌కోట సర్కిల్‌లో ఓ అధికారి ముందు వరుసలో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన అక్రమార్జన గురించి ఆరా తీస్తే కళ్లు బైర్లు కమ్మే అంశాలు బయటపడుతున్నాయి.

కోటలో పాగా...
శ్రీకాకుళం జిల్లాలో నాలుగు ప్రాంతాల్లోనూ, విశాఖ జిల్లాలోనూ పనిచేసిన ఆ అధికారి విశాఖపట్నం జిల్లాలో అవినీతి ఆరోపణలతో వేకెన్సీ రిజర్వ్‌(వీఆర్‌)లోకి వెళ్లారు. కొంతకాలానికి ఎస్‌కోటకు బదిలీపై వచ్చారు. ఏడాది క్రితం వచ్చిన ఆ అధికారి వస్తూనే తన పంథాను మళ్లీ కొనసాగిస్తున్నారు. తన పరిధిలోని మరో అధికారి సహకారంతో దందాలు కొనసాగిస్తున్నారు. వీరిద్దరి వల్ల మిగతా వాళ్లు కూడా వీరినే అనుసరిస్తున్నారు. అతని చర్యల గురించి జిల్లా ఎస్సీకి కూడా ఫిర్యాదులు అందడంతో
పిలిచి మందలించారని సమాచారం. అయినప్పటికీ ఆయన లెక్కచేయకుండా తనపని తాను చేసుకుపోతున్నారు. దాని కోసం తన చుట్టూ కానిస్టేబుళ్లతో ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. ఏళ్ల తరబడి బదిలీ కాకుండా ఉండేందుకు వారికి ఆయన అండగా ఉంటున్నారు.

ఇదీ దందా: కొత్తవలస నుంచి ఎల్‌కోటకు తక్కువ పరిమాణంలో గుట్కా వచ్చింది. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న పోలీస్‌ అధికారి విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న గుట్కా నిల్వలను కనుగొన్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను తప్పించేందుకు రూ.50 వేలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
అలమండ సంత నుంచి లారీల్లో పశువులను అక్రమంగా తరలిస్తుంటారు. వీటిలో నాలుగు లారీలు పట్టుకుని, ఒకదానినే పట్టుకున్నట్లు కేసు నమోదు చేసి నిర్వాహకుల నుంచి మూడు లారీలకు ఒక్కో లారీకి రూ. 12వేలు చొప్పున తీసుకున్నారని సమాచారం.
గడచిన మూడు నెలల్లో ఎస్‌.కోటలో ఏడు కేసులు, జామిలో రెండు కేసులు, ఎల్‌.కోటలో రెండు కేసులు, వేపాడలో రెండు కేసులు చొప్పున నమోదయ్యాయి. అయితే పట్టుకున్నప్పుడు ఉన్న వాహనాలు, నిందితుల సంఖ్య, దొరికిన సరుకు కేసు నమోదు చేసే నాటికి తగ్గిపోతోంది. ఒక కేసులో అయితే ఏకంగా గంజాయి రవాణా చేసిన లారీనే పక్కకు తప్పించారని తెలుస్తోంది.
ఎల్‌.కోటలో ఏడు, ఎస్‌కోటలో తొమ్మిది, వేపాడలో నాలుగు, జామిలో ఏడు లైసెన్స్‌  మద్యం షాపులున్నాయి. వీటి పరిధిలో బెల్టు షాపులు నడిపించేందుకు ఆ అధికారి వాటాగా నెలకు రూ. 4,500ల నుంచి రూ.6 వేల వరకూ ఇవ్వాల్సిందేనట. దీనికి ప్రతిగా గ్రామాల్లో గతంలో ఉన్నదానికి రెట్టింపు సంఖ్యలో బెల్టుషాపులు వెలిశాయి.
ఎస్‌కోట మండలం గోపాలపల్లి, బొడ్డవర ప్రాంతాల్లో రెండు ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఈ రెండింటిలో ఒక్కో దాని నుంచి రూ. 50వేలు చొప్పున అయ్యవారికి సమర్పించాల్సిందేనని చెబుతున్నారు. దీనికి ప్రతిఫలంగా ఎస్‌.కోట నుంచి అరకు–విశాఖ రోడ్డు ద్వారా విశాఖ జిల్లాకు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది.
జామి పోలీస్‌ స్టేషన్‌లో కొన్ని నెలల క్రితం ఒక పోలీస్‌ జీపు తగలబడింది. పోలీస్‌లపై కక్షతో పొక్లెయిన్‌ యజమాని ఈ జీపును తగులబెట్టారని తెలిసినప్పటికీ అతని నుంచి రూ. 1.50లక్షలు స్వపరిహారంగా తీసుకుని ఓ కానిస్టేబుల్‌ పొరపాటున సిగరెట్‌ పడేయడం వల్ల ప్రమాద వశాత్తూ జీపు తగులబడిందని కేసు క్లోజ్‌ చేశారు. దీనిపై డీజీపీకి కూడా ఫిర్యాదు వెళ్లడంతో రహస్య విచారణ జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement