ప్రతి పోలీసుపైనా శాంతిభద్రతల బాధ్యత

Responsibility of law order on every police - Sakshi

కాకినాడ రూరల్‌:  జిల్లాలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి పోలీసు పైనా ఉందని జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని అన్నారు. శుక్రవారం సర్పవరం పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన నెలవారీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని పోలీస్‌స్టేషన్‌కు వస్తే విచారించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సూచించారు. ప్రోపర్టీ కేసులలో రికవరీ తక్కువగా ఉందని, రికవరీ విషయంలో శ్రద్ధ వహించి రికవరీ పెంచేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకొని ఫలితాలు సాధించాలన్నారు. జైలు నుంచి విడుదలైన ప్రాపర్టీ కేసుల్లో ముద్ధాయిలపై నిఘాపెట్టి వారి సమాచారం సేకరించాలన్నారు.

 జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులలో సంబంధిత అధికారులను కలసి కేసు పెండింగ్‌నకు సంబంధించిన విషయాలపై దర్యాప్తు ముమ్మరం చేయాలన్నారు. ఎన్‌ఫోర్సుమెంట్‌ వర్కు కూడా మెరుగుపడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ నెల 15 నుంచి అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల పత్రాల పరిశీలన విషయంలో డిపాజిట్‌దార్లకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీపావళి సందర్భంగా షాపులను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏజెన్సీ స్టేషన్లకు సంబంధించి అందరూ అప్రమత్తం ఉండాలని ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్‌ వారెంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి వారెంట్లను అమలు పరచాలని, కోర్టుకు సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రోడ్డు సేఫ్టీలో భాగంగా హైవేలపై డ్యూటీ నిర్వర్తించేవారు అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో చాలా పోలీసుస్టేషన్ల శిథిలస్థితిలో ఉన్నందున వాటిని ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అడిషినల్‌ ఎస్పీ ఏఆర్‌ దామోదర్, ఏఎస్‌డీ రవిశంకర్‌రెడ్డి, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top