ఆధార్ లేకున్నా ఉపకార వేతనాల ఆన్‌లైన్


=కలెక్టర్ నివేదికతో ప్రభుత్వం అనుమతి

 =రెండు రోజుల్లో అందుబాటులోకి ఆన్‌లైన్ సేవలు


 

పాడేరు, న్యూస్‌లైన్ : ఆధార్ కార్డులు లేకపోవడంతో ఉన్నత విద్యలో  ఉపకార వేతనాల ఆన్‌లైన్ సౌకర్యానికి జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు కలెక్టర్ మేలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాల సౌకర్యం పొందేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కళాశాలల వారీగా దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ వేలాది మంది విద్యార్థులకు ఆధార్‌కార్డులు లేకపోవడంతో ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపర్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రియాంబర్స్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపర్చలేక తమకు న్యాయం చేయాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.జిల్లాలోనే సుమారు 3 వేల మంది గిరిజన విద్యార్థులు ఉపకార వేతనాల ఆన్‌లైన్‌కు దూరంగా ఉన్నారు. మైదాన ప్రాంతాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆధార్ కార్డుల సమస్యతోనే ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల ఆందోళనకు స్పందించిన కలెక్టర్ ఆరోఖ్యరాజ్ గత నెలలో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఆధార్‌కార్డులు లేకపోయినా ఆన్‌లైన్ సౌకర్యం కల్పించి ఉపకార వేతనాలు, ఫీజు రియింబర్స్‌మెంట్ సౌకర్యం వర్తింప చేయాలని కలెక్టర్ ఇచ్చిన నివేదికతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆధార్ కార్డులతో సంబంధం లేకుండా ఉపకార వేతనాల ఆన్‌లైన్‌కు సమ్మతించింది.  రేషన్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు, కుల, ఆదాయ దృవీకరణ పత్రాలతో ఆన్‌లైన్ సౌకర్యం వర్తింప చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసే తాజా ఉత్వర్వులు సోమవారం నాటికి వస్తాయని, తద్వారా ఆధార్‌కార్డులు లేకపోయిన విద్యార్థులకు ఉపకార వేతనాల ఆన్‌లైన్ సౌకర్యాన్ని వేగవంతం చేస్తామని గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరక్టర్ బి.మల్లికార్జునరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top