ఉత్తరాంధ్ర వాసులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు...అన్ని రకాల సేవలు అందేలా 21 సూపర్ స్పెషాలిటీలు.. రూ.250 కోట్లు అంచనా వ్యయంతో నిర్మాణం..
=నిధుల కోతకు చర్యలు
=సూపర్ స్పెషాలిటీలు, పడకల కుదింపు
=అధికారులను నివేదిక కోరిన ప్రభుత్వం
సాగర్‌నగర్, న్యూస్‌లైన్ : ఉత్తరాంధ్ర వాసులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు...అన్ని రకాల సేవలు అందేలా 21 సూపర్ స్పెషాలిటీలు.. రూ.250 కోట్లు అంచనా వ్యయంతో నిర్మాణం..ఇదీ మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి లక్ష్యం. అందుకే ఆయన హయాంలో విమ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తొలి విడత రూ.35 కోట్లు కేటాయించారు. ఆయన లేకపోవడంతో పనులు పడకేశాయి. నిధులు నిలిచిపోయాయి. ఆ తర్వాత రెండు విడతల్లో రూ.25 కోట్లు విడుదలయ్యాయి. ఇప్పుడు నిధులు, సౌకర్యాలు, సదుపాయాలు కుదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉత్తరాంధ్ర వాసుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. మహానేత ఆశయానికి తూట్లు పొడుస్తోంది.
హైదరాబాద్‌లోని నిమ్స్ తరహాలో విశాఖలో విమ్స్ నిర్మించాలని 2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి భావించారు. దీని కోసం జాతీయరహదారిని ఆనుకొని హనుమంతవాక దరి పశుసంవర్థక శాఖకు చెందిన 110.24 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీని నిర్మాణానికి రూ.250 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. 2007 అక్టోబర్‌లో భూమి పూజ చేశారు. 2009 డిసెంబర్ లేదా 2010 జనవరి నాటికి దీన్ని ప్రారంభించాలని, రెండు విడతల్లో నిర్మాణం జరపాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
తొలి విడతగా 2008లో వైఎస్సార్ హయాంలో రూ.35 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఆ తర్వాత రోశయ్య ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది. తాజాగా మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.5 కోట్లు ఇచ్చారు. పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కావాలంటే మరో రూ.190 కోట్లు అవసరం. కానీ ఆ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. సూపర్ స్పెషాలిటీలను, పడకలను కుదించి నిధులకు కోత పెట్టాలన్న ఆలోచనలో ఉంది. వాస్తవానికి 1,130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీలు, ఆరు బ్లాకులు నిర్మించాలి. దీన్ని రెండు విడతల్లో అందుబాటులోకి తీసుకురావాలి.
మొదట విడతలో ఆరు సూపర్ స్పెషాలిటీలు, 450 పడకలు నిర్మించాలి. రెండో విడతలో 15 సూపర్ స్పెషాలిటీలు, 680 పడకలు నిర్మించాల్సి ఉంది. వీటి ప్రకారం వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బందిని నియమించాలి. కానీ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా సౌకర్యాలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. మొదటి విడతలో ఆరు సూపర్ స్పెషాలిటీలు, 200 పడకలు, రెండో విడతలో 11 సూపర్ స్పెషాలిటీలు, 300 పడకలకు కుదించాలని ఇక్కడి అధికారులకు ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీనిలో భాగంగా అధికారులు ఇప్పటికే దీని ప్రకారం నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపించడానికి సిద్ధమవుతున్నారు.
నాలుగు సూపర్ స్పెషాలిటీలతో పాటు ఏకంగా 630 పడకలను తగ్గించేశారు. దీని ప్రకారం మొదటి విడతలో 200 పడకలు, ఆరు సూపర్ స్పెషాలిటీలకు రూ.44,10,34,000లు ఖర్చవుతుందని, రెండో విడతలో 11 సూపర్ స్పెషాలిటీలు, 300 పడకలకు రూ.91,60,32,000లు ఖర్చవుతుందని నివేదిక తయారు చేశారు. ఈ రెండు విడతల్లో కలిపి రూ.135 కోట్ల 70 లక్షల 65 వేలు ఖర్చవుతుందని నివేదికలో పొందుపరిచారు.
వెల్లువెత్తుతున్న విమర్శలు
విమ్స్‌పై ప్రభుత్వం చూపుతున్న వివక్షతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు కేటాయించాల్సి వస్తుందనే సౌకర్యాల్లో కోత విధిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తే ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నా విమ్స్‌పై నిర్లక్ష్యం చూపిస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.