ఏవోబీలో రెడ్‌ అలెర్ట్‌

Red Alert In AOB Region - Sakshi

నేటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు 

విస్తృతంగా పోలీస్‌ తనిఖీలు 

బితుకుబితుకుమంటూ గిరిజనం 

పాడేరు,సీలేరు: మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఏవోబీలో పోలీసులు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు.  అవుట్‌ పోస్టుల ప్రాంతాల్లో అప్రమత్తమయ్యారు. సోమవారం నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాల నిర్వహణకు మావోయిస్టులు ఏర్పాట్లు చేస్తున్నారు.జీకే వీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో రెండు నెలల కిందట జరిగిన ఎన్‌కౌంటర్లలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తదనంతరం వారోత్సవాలు జరుగుతుండడంతో మావోయిస్టులు ప్రతీకార దాడులు జరిపే అవకాశం ఉందని సమాచారం. దీంతో మారుమూ ల గ్రామాల ప్రజలు బితుకుబితుకుమంటూ ఉన్నారు. అయితే పీఎల్‌జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. విశాఖ రూరల్‌ ఎస్పీ అట్టాడ బాబూజీ, ఒడిశాలోని మల్కన్‌గిరి,కోరాపుట్‌ జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు కూంబింగ్‌లో నిమగ్నమయ్యాయి.

మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు ఆంధ్రా,ఒడిశా పోలీ సు అధికారులు పకడగ్బందీగా  వ్యూహం రచించినట్టు సమాచారం. ఒడిశా పోలీసు బలగాలతో పాటు,విశాఖ జిల్లాకు చెందిన పోలీసు పార్టీలు ఉమ్మడిగా ఏవోబీలో కూంబింగ్‌ చర్యలు చేపట్టాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కొయ్యూరు,సీలేరు, జీ,కే.వీధి,చింతపల్లి,అన్నవరం,జి.మాడుగుల,పెదబయలు,ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ల పరిధిలో అదనపు పోలీసు బలగాలను అందుబాటులో ఉంచారు. అరకు,డుంబ్రిగుడ,హుకుంపేట,అనంతగిరి పోలీసుస్టేషన్ల అధికారులు,ప్రత్యేక పార్టీల పోలీసులు అప్రమత్తమయ్యారు. రాళ్లగెడ్డ,కోరుకొండ,నుర్మతి, రూడకోట అవుట్‌ పోస్టులలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. మావోయిస్టు పార్టీ వారోత్సవాలతో ఏవోబీ అంతా పోలీసు నిఘా అధికమైంది.అన్ని మండల కేంద్రాలు,ప్రధాన రోడ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణుకుల లగేజీ బ్యాగ్‌లను సోదా చేస్తున్నారు.కల్వర్టులు,రోడ్డు ఇరువైపులా బాంబు స్క్వాడ్‌తో  తనిఖీలు జరుపుతున్నారు. మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రజా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.  సీలేరు మీదుగా అంతర్రాష్ట్రాలకు వెళ్లే రాత్రి సర్వీసులను నిలిపివేయనున్నారు. సీలేరు ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులకు సంబంధించిన వాహనాలను పోలీసు స్టేషన్ల వద్దకు తరలించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top