తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.
-కొనసాగుతున్న ద్రోణి
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. చత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితలద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో కొన్నిచోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శుక్రవారం తెలిపింది.
అదే సమయంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురవవచ్చని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడవచ్చని, వడగళ్ల వానలు కూడా కురవవచ్చని తెలిపింది. గడచిన 24 గంటల్లో ఈ రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమలోని మడకశిరలో 8, గుమ్మగట్టలో 7, గుత్తిలో 5, రాయదుర్గం, నందవరం, రుద్రవరంలలో 4 సెం.మీల చొప్పున, కోస్తాంధ్రలోని కొమరాడలో 4, పొదిలి, మాచెర్లలలో 3 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదయింది. అలాగే తెలంగాణలోని ఏటూరు నాగారం, గోవిందరావుపేటలలో 7, వెంకటాపూర్, మహేశ్వరపురంలలో 6, కొత్తగూడెం, మంగనూర్, గుండాలలో 5 సెం.మీల చొప్పున వర్షం కురిసింది.