రాష్ట్రమంతటా వర్షాలు | Sakshi
Sakshi News home page

రాష్ట్రమంతటా వర్షాలు

Published Sun, Jul 21 2019 3:20 AM

Rainfall across the state - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారుతున్నాయి. దట్టమైన మేఘాలు అల్లుకోగా.. రాష్ట్రమంతటా వర్షాలు విస్తరించాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మరో రెండు రోజులపాటు దీని ప్రభావం కొనసాగి, మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వైపు విస్తరిస్తోంది. దీనివల్ల వర్షాల కొనసాగటానికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆవర్తనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాలకు విస్తరించింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇదిలావుంటే.. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది దక్షిణ అండమాన్‌ సముద్రం వైపు విస్తరించి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఆవరించి ఉంది.

అల్పపీడనం ఏర్పడితే తప్ప దీని ప్రభావం రాష్ట్రంపై ఉండబోదని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు పలుచోట్ల భారీ వర్షం పడింది. కర్నూలు జిల్లాలో 20 రోజుల తర్వాత వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో గుంటూరు, కృష్ణా జిల్లా తిరువూరు, కర్నూలు జిల్లా అవుకు ప్రాంతాల్లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 28 ప్రాంతాల్లో అత్యల్పంగా ఒక సెంటీమీటర్‌ చొప్పున కురిసింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో 8, ప్రకాశం జిల్లా సంతమాగులూరు, కడప జిల్లా ప్రొద్దుటూరులో 7 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా బాపట్ల, కృష్ణా జిల్లా అవనిగడ్డ, అనంతపురం జిల్లా గుత్తి, చిత్తూరు జిల్లా కుప్పంలో 6 సెంటీమీటర్ల చొప్పున నమోదైంది.

ప్రకాశం జిల్లా కారంచేడు, గుంటూరు జిల్లా అచ్చంపేట, విజయనగరం జిల్లా కురుపాం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, కడప జిల్లా రాజంపేట, చిత్తూరు జిల్లా పలమనేరు, కర్నూలు జిల్లా ఆత్మకూరులో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస, గుంటూరు జిల్లా రేపల్లె, కడపజిల్లా పెనగలూరు, వల్లూరులో 4 సెంటీమీటర్ల చొప్పున నమోదైంది. విజయనగరం జిల్లా బాలాజీపేట, ప్రకాశం జిల్లా ఒంగోలు, శ్రీకాకుళం జిల్లా పాలకొండ, విశాఖ జిల్లా చోడవరం, కృష్ణా జిల్లా కైకలూరు, కడప జిల్లా కమలాపురం, చిత్తూరు జిల్లా వెంకటగిరికోట, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, ఓర్వకల్లులో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, విజయనగరం జిల్లా కొమరాడ, ప్రకాశం జిల్లా వెలిగొండ్ల, వండ్లమూరు, యర్రగొండపాలెం, అద్దంకి, చిత్తూరు జిల్లా పాలసముద్రం, కడప జిల్లా వేంపల్లి, పోరుమామిళ్ల, చాపడ్‌లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

Advertisement
Advertisement