రైల్వే కమ్యూనిటీ హాల్‌లో అడ్డగోలు దోపిడీ!

Railway Staff Using Railway Community Hall For Their Personnel In Krishna - Sakshi

 నిర్వహణలో అన్నీ అక్రమాలే

సామగ్రి, డెకరేషన్, ఏసీలకు భారీగా డబ్బులు వసూలు

కమిటీ సభ్యులు ప్రైవేటు కల్యాణ మండపం నిర్మాణం

సాక్షి, విజయవాడ (కృష్ణా): స్థానిక సత్యనారాయణపురంలోని రైల్వే కమ్యూనిటీ హాల్‌ నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. రైల్వే సిబ్బంది తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఈ కమ్యూనిటీ హాల్స్‌ను, రైల్వే ఇనిస్టిట్యూట్‌ను రైల్వేశాఖ నిర్వహించింది. గతంలో దీన్ని ఉద్యోగస్తులతో ఓ కమిటీ ఏర్పడి నిర్వహించే వారు. అయితే సదరు కమిటీపై ఆరోపణలు రావడం.. పదవీ కాలం ముగియడంతో అధికారులే స్వయంగా నిర్వహిస్తున్నారు. అయితే గత కమిటీ ఏ విధమైన వ్యాపార ధోరణులను అవలంబించిందో అదే తరహాలో ప్రస్తుతం అధికారులు అవలంభిస్తున్నారని  రైల్వే సిబ్బంది ఆరోపిస్తున్నారు.

అడుగడుగునా దోపిడీ!
రైల్వే కమ్యూనిటీ హాల్‌కు వెళ్లే వారికి ఖేదమే మిగులుతోంది. అడుగడుగునా దోపిడీకి గురవుతున్నామని వారంతా భావిస్తున్నారు. రైల్వే సిబ్బందికి రూ.22 వేలు, బయట వారికి రూ.32 వసూలు చేస్తున్నారు. కానీ దానికి తగ్గ సౌకర్యాలు మాత్రం కల్పించడంలేదు.

100 లీటర్లు.. నాలుగు గంటల ఏసీ?
ఏసీ కావాలంటే నాలుగు గంటలకు 100 లీటర్ల డీజిల్‌ డిమాండ్‌ చేస్తున్నారు.  దీనికి గాను సుమారు రూ.7000 వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. కానీ వాస్తవంగా 40 లీటర్లే సరిపోతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. నాలుగు గంటలకు ఏసీకి బిల్లు చెల్లించినా రెండున్నర గం టలు వేసి ఆ చల్లదనంతోనే మిగిలిన సమయం పూర్తి చేస్తున్నారు.

సామగ్రి బయటి నుంచే...
ఇక కమ్యూనిటీ హాల్‌లో కావాల్సి సామగ్రి ఎక్కు వ బయట నుంచే అద్దెకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అదీ  వారు చెప్పిన షామియానా కొట్టు నుంచే వాటిని తెచ్చుకుని వాడుకోవాలి. అలాగే డెకరేషన్‌ కూడా వారు చెప్పిన వారి చేతనే చేయించుకోవాలి. సామగ్రి, డెకరేషన్‌కు బయట రేట్లతో పోల్చితే కనీసం 25 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు.  కాగా ఇక్కడ ఉన్న వంటశాలకు రక్షణ కవచం లేకపోవడంతో కుక్‌లు ఇబ్బంది పడుతున్నారు.

పాత కమిటీపై ఫిర్యాదులు 
గత కమిటీలో కొంతమంది సభ్యులు కబేళాలో నూతనంగా నిర్మిస్తున్న కల్యాణ మండపంలో భాగస్వామ్యం ఉంది. ఆ కల్యాణ మండపం నిర్మాణ విషయంలో రైల్వే కమ్యూనిటీ హాల్‌లోని సామగ్రిని యధేచ్ఛగా వాడుకున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే కమ్యూనిటీ హాల్‌ కోసం కొనుగోలు చేసిన కేబుల్స్, ఇతర సామాగ్రిని అక్కడకు తరలించారని ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదయ్యాయి. దీంతో తొలుత ఏఈ స్థాయి అధికారితో విచారణ చేయించి, తర్వాత త్రిసభ కమిటీని వేశారు. ఈ కమిటీ విచారణ చేసింది కాని ఇంకా నివేదిక ఇవ్వలేదని సమాచారం. కాగా గత ఏప్రిల్‌కు ముందు ఉన్న కమిటీ ఏ విధంగా డబ్బులు వసూలు చేసేదో ఇప్పుడు అధికారులు అదే విధంగా వసూలు చేస్తున్నారు తప్ప రైల్వే ఉద్యోగస్తులకు సిబ్బందికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఉద్యోగస్తులకు ఉపయోగపడేలాగా...
స్టాఫ్‌ వెల్పేర్‌ ఫండ్‌ నుంచి సుమారు రూ.75 లక్షలు ఖర్చు చేసి కమ్యూనిటీ హాల్, ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేశారు. అదే సమయంలోనో, తర్వాతో మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి వంట సామగ్రి, ఇతర సామగ్రి కొనుగోలు చేసి ఉంటే ఆ మేరకు ఖర్చు తగ్గేది. అలాగే ఏసీ కల్యాణ మండపం అని అద్దె వసూలు చేస్తున్నారు. అందువల్ల ఏసీ సౌకర్యం ఉచితం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే  కమ్యూనిటీ హాల్‌లో సౌకర్యాలు మెరుగు పర్చాలని కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top