రైల్వే ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Railway Employee Commits Suicide Attempt - Sakshi

డివిజన్‌ సీనియర్‌ డీసీఎం వేధింపులే కారణం

బాధితుడ్ని బుజ్జగించేందుకు ఉద్యోగుల ప్రయత్నం

ఘటనపై నివేదిక ఇవ్వాలని డీఆర్‌ఎం భూమా ఆదేశం

లక్ష్మీపురం(గుంటూరు): గుంటూరు రైల్వే డివిజన్‌ సీనియర్‌ డీసీఎం వేధింపులు తాళలేక  శనివారం గుంటూరు రైల్వే స్టేషన్‌లోని  కమర్షియల్‌ సూపర్‌వైజర్‌ మొహమ్మద్‌ కరిముల్లా రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఘటన శనివారం రైల్వే వర్గాల్లో సంచలనం కలిగించింది. సమాచారం తెలుసుకున్న డీఆర్‌ఎం వి.జీ.భూమా తక్షణమే రైల్వే డీసీఈ (డివిజన్‌ సెక్యూరిటీ కమిషనర్‌) ఎలీషా, సీనియర్‌ ఏసీఎం అలీ ఖాన్, సంబంధిత అధికారులను జరిగిన విషయం గురించి ఆరా తీయాల్సిందిగా ఆదేశించారు. దీంతో హుటాహుటిన డీఎస్‌ఈ, ఏఎస్‌ఎం, ఆర్పీఎఫ్‌ సీఐ శ్రీనివాసరావు, చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని కరిముల్లాతో మాట్లాడి బుజ్జగించే యత్నం చేశారు.

 తనను సీనియర్‌ డీసీఎం ఉమామహేశ్వరరావు ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారని, ఇక తాను బతకనని కరిముల్లా వారి ఎదుట కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో డీఎస్‌ఈ ఎలీషా సీనియర్‌ డీసీఎంపై తాను డీఆర్‌ఎంకు నివేదికను సమర్పిస్తానని కరిముల్లాకు భరోసా ఇచ్చారు. బాధితుడు మొహమ్మద్‌ కరిముల్లా తెలిపిన వివరాల ప్రకారం... కరిముల్లా గతంలో సీనియర్‌ డీసీఎం కార్యాలయంలో కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌గా వి«ధులు నిర్వర్తించారు. ఆ సమయంలో డీఆర్‌ఎం విజయశర్మ వద్ద సీసీగా తీసుకున్నారు.

 డీఆర్‌ఎం చెప్పిన పనులు అన్నీ చేసేవారు. అది సీనియర్‌ డీసీఎం కె.ఉమామహేశ్వరరావుకు నచ్చేది కాదు. డీఆర్‌ఎం విజయశర్మ గుంటూరు డివిజన్‌ నుంచి బదిలీ అయి వెళ్లినప్పటి నుంచి సీనియర్‌ డీసీఎం ఉమామహేశ్వరరావు కక్ష సాధింపుగా కరిముల్లాను నిత్యం వేధింపులకు గురి చేసే వారు. విజయశర్మ బదిలీ తర్వాత కరిముల్లాను బుకింగ్‌ ఆఫీసులోకి బదిలీ చేశారు. కరిముల్లా తాను న్యూరో సమస్యతో బాధపడుతున్నానని, బుకింగ్‌ ఆఫీసు నుంచి బదిలీ చేయమని సీనియర్‌ డీసీఎంను వేడుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో గత నెల మూడో తేదీన సీనియర్‌ డీసీఎం ఉమామహేశ్వరరావు తనను వేధిస్తున్నారంటూ డీఆర్‌ఎం వీజీ భూమాకు ఫిర్యాదుచేశారు.

మెంటల్‌ అని చెప్పించి ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారుఐదు నెలల క్రితం కరిముల్లా ఆరోగ్యం బాగో లేదని రైల్వే ఆసుపత్రికి చికిత్సకు వెళితే సీనీయర్‌ డీసీఎం ఉమామహేశ్వరరావు  రైల్వే డాక్టర్లపై ఒత్తిడి చేసి తనకు న్యూరో సమస్య కాదని మతిస్థిమితం లేదని చెప్పి ఎర్రగడ్డ మెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో 15 రోజులు చికిత్స చేసి నాకు ఎలాంటి మతి స్థిమితం లేదని తేల్చి రిపోర్ట్‌ ఇచ్చారని కరిముల్లా తెలిపారు.సీనియర్‌ డీసీఎం వేధింపుల వలనే తాను చనిపోదామని నిర్ణయించుకున్నానని కరిముల్లా తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top