11 నుంచి మూడో విడుత రచ్చబండ | Rachabanda programme from 11th | Sakshi
Sakshi News home page

11 నుంచి మూడో విడుత రచ్చబండ

Nov 9 2013 12:56 AM | Updated on Sep 2 2017 12:25 AM

ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తోంది.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తోంది. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, కొత్త రేషన్‌కార్డుల జారీ, పింఛన్ల పంపిణీకి మూడో విడత రచ్చబండలో పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. ముందుచూపుతో దరఖాస్తుదారుల నుంచి వ్యతిరేకత రావద్దనే ఉద్దేశంతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈనెల 11 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
 
 అధికారులు జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. మహానేత వైఎస్సార్ మరణానంతరం కొత్త రేషన్‌కార్డుల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నాలుగేళ్ల నుంచి నూతన కార్డుల జారీ లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 70 వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే రెండు విడుతల రచ్చబండ కార్యక్రమం ద్వారా సుమారు 90 వేల అర్జీలు వచ్చాయి. క్షుణ్ణంగా పరిశీలించి 22 వేల మంది లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం కార్డులు జారీ చేసింది. మిగతా వారికి మంజూరు చేయలేదు. కాగా, మూడో విడత రచ్చబండలో 45,294 కొత్త రేషన్‌కార్డులు. 11,210 పింఛన్ల పంపిణీ, 11,210 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, 28,603 మంది విద్యుత్ వినియోగదారుల బకాయిల మినహాయింపు చేయాలని ప్రభుత్వం చూస్తోంది.
 
 ఎస్సీ, ఎస్టీలనూ ఆకట్టుకునే యత్నం
 జిల్లాలో కొంతకాలంగా నెలకొన్న పరిస్థితులు అధికార పార్టీకి కలిసి రావడం లేదు. సాధారణ ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే జిల్లాలో 50 యూనిట్ల కన్నా తక్కువగా విద్యుత్ వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీల బకాయిలు ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధమైంది. ఇందుకు రూ.15.97 కోట్ల జారీకి ఉత్తర్వులు వెలువర్చినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 28,603 మంది ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఈ మినహాయింపు వర్తించనుంది. మూడేళ్ల క్రితం వికలాంగత్వం తక్కువగా ఉందని పింఛన్లను ప్రభుత్వం ఏరివేసింది. ఫలితంగా సదరమ్ క్యాంపు సర్టిఫికెట్‌లో 40 శాతం వికలాంగత్వం ఉంటేనే పింఛన్‌కు అర్హులని మెలిక పెట్టింది. దీంతో అర్హులైన వికలాంగులు పింఛన్‌ను కోల్పోయారు. రెండు విడతలుగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో సుమారు 61 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ రచ్బబండ ద్వారా 11,210 మందికి పింఛన్ల పంపిణీ చేయనున్నారు.
 
 రచ్చబండ షెడ్యూల్ ఇదే..
 రచ్చబండ నిర్వహణకు మండలాల వారీగా షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లేదా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమం నిర్వహిం చాలి. కళాశాల ఆవరణలు, మార్కెట్‌యార్డులు, ప్రభు త్వ అతిథిగృహాలు, మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాలు, పాఠశాల ఆవరణల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 11న వాంకిడి, బోథ్, 12న జైనూర్, తలమడుగు, కుంటాల, 13న మంచిర్యాల, భైంసా (అర్బన్), భైంసా, సిర్పూర్(టి), 14న జైనథ్, 15న బెల్లంపల్లి, ఇచ్చోడ, మంచిర్యాల (అర్బన్), కుంటాల, 16న ఆదిలాబాద్, రెబ్బెన, తాండూర్, కుభీర్, బెజ్జూర్, 18న బేల, ఆసిఫాబాద్, కాసిపేట, బజార్‌హత్నూర్, ఉట్నూర్, దహెగాం, 19న నెన్నెల, తాంసి, చెన్నూర్, లోహేస్రా, కాగజ్‌నగర్, 20న తిర్యాణి, వేమనపల్లి, నేరడిగొండ, మందమర్రి, మందమర్రి(అర్బన్), ఇంద్రవెల్లి, దండేపల్లి, తానూర్, దిలావర్‌పూర్, కాగజ్‌నగర్ (అర్బన్), 21న నార్నూర్, భీమిని, గుడిహత్నూర్, కోటపల్లి, ఖానాపూర్, లక్సెట్టిపేట, ముధోల్, మామడ, 22న బెల్లంపల్లి (అర్బన్), జైపూర్, కడెం, లక్ష్మణచాంద, 23న ఆదిలాబాద్ (అర్బన్), కెరమెరి, జన్నారం, నిర్మల్ (అర్బన్), 25న సిర్పూర్(యు), సారంగపూర్ మండలాల్లో రచ్చబండ కార్యక్రమం జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement