
కర్ణాటక: రాష్ట్రంలో అక్రమంగా కలిగిఉన్న బీపీఎల్ కార్డులను రద్దు చేయడంపై బుధవారం ఉదయం ముఖ్యమైన సమావేశం జరుగుతుందని ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప చెప్పారు. రేషన్ కార్డుల సమస్యల పరిష్కారం గురించి అందులో మాట్లాడుతానని మంగళవారం బెంగళూరులో తెలిపారు. రేషన్ పంపిణీ భారాన్ని తగ్గించుకోవాలని సర్కారు తీవ్ర ప్రయత్నాలను చేస్తోంది.
6 లక్షల కార్డులకు ఈకేవైసీ లేదు
రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది బీపీఎల్ కార్డులు రద్దు అయ్యే అవకాశముందని తెలిసింది. పేదలు కాకపోయినా ఈ కార్డులను కలిగి ఉన్నట్లు ప్రభుత్వం కనుగొంది.
సర్కారు సర్వేలో మొత్తం 12,68,097 అనుమానాస్పద రేషన్ కార్డులు బయటపడ్డాయి.
19,690 మంది నియమాలకు విరుద్ధంగా బీపీఎల్ కార్డులు కలిగిఉన్నారు
ఏటా రూ.25 లక్షలకు పైగా లావాదేవీలు కలిగినవారు 2,684 మందికి కార్డులు ఉన్నాయి.
6,16,196 మంది కార్డుదారులు ఇప్పటికీ ఈ కేవైసీ చేయించుకోలేదు.
ఏటా రూ.1.20 లక్షల కంటే అధిక ఆదాయం కలిగిన కార్డుదారులు 5,13,613 మంది ఉన్నారు.
అంతర్రాష్ట్ర కార్డుదారులు 365 మంది, 7.5 ఎకరాల కంటే అధిక భూమి ఉన్న 33,456 కుటుంబాలు రేషన్ తీసుకుంటున్నాయి.
ఆరు నెలల నుంచి రేషన్ పొందని కార్డుదారులు 19,893 మందిగా తేలింది.
1,146 కార్డులు మృతుల పేర్లతో ఉన్నాయి.
119 మంది కార్డుదారులకు సొంత కార్లు, జీప్‌లు ఉన్నాయి.
ఇలా అనేక అవకతవకలు బయటపడడంతో ఆ కార్డులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.