‘మన ఇసుక వాహనం’యాప్‌తో అనుసంధానం
యాప్‌లో బుక్ చేస్తే ఇంటికే ఉచితంగా ఇసుక
రవాణా చార్జీలు అధికంగావసూలు చేయకుండా చర్యలు
గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఇసుక కోసం ఇబ్బందులు పడకుండా ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ఇంటికే ఇసుక వచ్చే విధానాన్ని గృహనిర్మాణ శాఖ సిద్ధం చేసింది. తెలంగాణ గనుల శాఖ కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గతంలో రూపొందించిన ‘మన ఇసుక వాహనం’యాప్‌ను ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనుసంధానించారు. ఇందులో ఉన్న సాంకేతికపరమైన అవాంతరాలను గుర్తించి, దాన్ని మరింత మెరుగ్గా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ యాప్‌లో ఆయా గ్రామాల్లోని ట్రాక్టర్ల వివరాలను అనుసంధానించారు. ఇందిరమ్మ లబ్దిదారులు ఆ యాప్‌లో ఇసుక లోడ్ బుక్ చేసి, వాహన రవాణా చార్జీని ఆన్‌లైన్‌లో చెల్లించగానే, ఆ ఊరికి సంబంధించి యాప్‌లో ఉన్న వాహనం వెళ్లి ఇసుకను తెచ్చి లబ్దిదారుకు అందిస్తుంది. ఇందిరమ్మ పథకం కింద లబ్దిదారులకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. కేవలం ఇసుక రీచ్/ఇసుక బజార్/ ఇసుక డంప్ నుంచి ఇసుకను తరలించే ట్రాక్టర్‌కు రవాణా ఖర్చులు చెల్లిస్తే సరిపోతుంది.
ట్రాక్టర్ యజమానులు తోచినంత డిమాండ్ చేసే వీలు లేకుండా రవాణా చార్జీలను కూడా అధికారులే ఖరారు చేసి యాప్‌లో నిక్షిప్తం చేశారు. ఇసుక బుక్ చేసుకున్న లబ్దిదారు ఇల్లు ఇసుక బజార్ నుంచి ఎంత దూరం ఉందో... దానికి తగ్గ చార్జీ ఆటోమేటిక్‌గా యాప్‌లో తెలుస్తుంది. ఆ మొత్తాన్ని చెల్లించి ఇసుక పొందే ఏర్పాటు చేస్తున్నట్టు గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ తెలిపారు.

ఇసుక పక్కదారి పట్టకుండా లబ్దిదారు బుక్ చేయగానే వన్‌టైం బార్ కోడ్ జనరేట్ అవుతుంది. దాన్ని స్కాన్ చేస్తేనే ఇసుక తరలింపు సాధ్యమవుతుందని, ఇది అక్రమాలకు కళ్లెం వేస్తుందని ఆయన తెలిపారు. మంగళవారం గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. ఇసుక రీచ్‌లు దూరంగా ఉండే ప్రాంతాల్లో ఇసుక బజార్‌లు ఏర్పాటు చేసి ఇసుకను అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించారు.
నిబంధనల మేరకే కట్టాలి..
ఇందిరమ్మ ఇళ్ల విస్తీర్ణం 400 చ.అ.కు తగ్గకుండా, 600 చ.అ.కు పెరగకుండా ఉండేలా నిబంధన విధించామని, మేస్త్రీలు కూడా ఇంటి పైకప్పును అదే విస్తీర్ణంలో నిర్మించాలని గౌతమ్ సూచించారు. కొందరు పైకప్పును ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించి ఎక్కవ చార్జీలు డిమాండ్ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో గతంలో డబుల్ బెడ్‌రూమ్ పథకంలో భాగంగా నిర్మించిన కాలనీలు కొన్ని ఖాళీగా ఉన్నాయని, వాటిని లబ్ధిదారులకు అలాట్ చేసినా అక్కడ ప్రభుత్వ పాఠశాలలు లేక వెళ్లటం లేదని తెలిపారు.
అలాంటి చోట్ల బడులు ఏర్పాటు చేస్తున్నారని, త్వరలో లబ్దిదారులు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించుకోని లబ్దిదారులకు ఇళ్ల మంజూరీని రద్దు చేయబోమని హామీ ఇచ్చారు. అలాంటి వారు స్వయంసహాయక బృందాల్లో ఉంటే రుణాలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 22 వేల మందికి రూ.236 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు.
జన్‌ధన్ ఖాతాలు, తపాలా శాఖ ఖాతాల నగదు నిల్వపై పరిమితి ఉన్నందున ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో సమస్యలు వస్తున్నాయని, వారు బ్యాంకులను సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.25 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని, లబ్దిదారులకు ఇప్పటివరకు రూ.2,526.12 కోట్లు చెల్లించినట్టు వివరించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఈశ్వరయ్య, జీఎంలు శ్రీదేవి, మమత తదితరులు పొల్గొన్నారు.


