
ఇప్పటి వరకు 2.31 లక్షల కుటుంబాలకు కొత్త కార్డులు
క్షేత్ర స్థాయిలో సగానికి పైగా విచారణ పెండింగ్
సిఫార్సులుంటేనే విచారణ, ఆమోదం ప్రక్రియ
ఇదీ గ్రేటర్‌లో పరిస్థితి
సాక్షి, సిటీబ్యూరో: సాక్ష్యాత్తు రాష్ట్ర రాజధానిలో(GHMC) కేవలం సుమారు 2.31 లక్షల కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు(Telangana Ration Cards) మంజూరయ్యాయి. సగానికి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో మగ్గుతున్నాయి. ఫలితంగా నిరుపేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు అందని ద్రాక్షగా తయారైంది. రెండు నెలల నుంచి కొత్త రేషన్‌న్‌కార్డు దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ, ఆమోదం ప్రక్రియ అంతంత మాత్రంగా మారింది. కేవలం మధ్యవర్తుల ప్రమేయం, ఇతరాత్ర సిఫార్సుల ఉన్న దరఖాస్తులకు మాత్రమే మోక్షం లభిస్తోంది.
వాస్తవంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మీ సేవా కేంద్రాల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడంతో నిరుపేదలు పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నారు. ఒకటి రెండు నెలల వ్యవధిలోనే కొత్త కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైంది. క్షేత్ర స్థాయి విచారణ కోసం ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. ఏకంగా ఆగస్టు మొదటి వారంలో మంత్రులు సైతం నియోజకవర్గాల వారిగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి కొత్త కార్డుల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. రేషన్‌కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని ప్రకటించిన పౌరసరఫరాల శాఖ.. ఆ తర్వాత కొత్త కార్డులు మంజూరును తగ్గించింది.
ఆరు లక్షలపైనే దరఖాస్తులు
గ్రేటర్ పరిధిలో సుమారు ఆరు లక్షల పైనే కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో మంజూరు 30 శాతం మించలేదు. కనీసం దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ కూడా ముందుకు సాగడం లేదు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే ఎఫ్‌ఎస్‌సీ ఆన్‌లైన్ లాగిన్‌కు నాలుగేళ్ల తర్వాత మోక్షం లభించినా మంజూరు మాత్రం కొందరికి పరిమితమవుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2021 ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల చేసుకునే పౌరసరఫరా శాఖ వెబ్‌సైట్ ఆన్‌లైన్ లాగిన్ నిలిచిపోయింది.
అప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను 360 డిగ్రీల స్థాయిలో వడబోసి అదే ఏడాది జూలై చివరి వారంలో కొత్త కార్డులు మంజూరు చేసింది. మొత్తం దరఖాస్తుల్లో 40 శాతం మాత్రమే క్లియర్ కాగా..మిగతా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ లేకుండా పోయింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పునరుద్ధరించారు. దీంతో దరఖాస్తుల నమోదు నిరంత ప్రక్రియగా సాగుతున్నా మంజూరు నత్తనడకన సాగుతోంది.
కార్డు లేని కుటుంబాలు పది లక్షల పైనే..
గ్రేటర్‌లో రేషన్ కార్డులు లేని కుటుంబాలు 10 లక్షలపైనే ఉన్నాయి. సుమారు కోటిన్నర జనాభా కలిగిన మహానగరంలో సుమారు 40 లక్షల కుటుంబాలు ఉండగా అందులో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు 27.21 లక్షలు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం 17.21 లక్ష కుటుంబాలు మాత్రమే తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. మిగతా కుటుంబాలు రేషన్ కార్డులు లేక వివిధ సంక్షేమ పథకాల వర్తింపు కోసం తల్లడిల్లుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రజా పాలనలో పేద కుటుంబాలు ఆరు గ్యారంటీల పథకాలతో పాటు ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నాయి.
హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు 5.73 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వచ్చి చేరాయి. అయితే ప్రభుత్వం వాటిని పక్కకు పెట్టి ఇటీవల జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేని కుటుంబాలను గుర్తించి విచారణ జరిపింది.అయితే అది కాస్త విమర్శలకు దారితీయడంతో తిరిగి ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తోంది.