తండ్రికి తగ్గ తనయుడు వైఎస్‌ జగన్ : ఆర్ కృష్ణయ్య

R Krishnaiah to attend YSRCP BC Garjana  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్యను వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం నేతలు మంగళవారం కలిశారు. ఆర్ కృష్ణయ్యను ఈనెల 17న నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ బీసీ గర్జనకు ఆ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి ఆహ్వానించారు. జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. '40 ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి ఉద్యమిస్తున్న ఆర్ కృష్ణయ్యని సాదరంగా ఏపీకి ఆహ్వానిస్తున్నాం. మా నాయకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన 17న ఏలూరులో జరిగే బీసీ గర్జనకు ఆహ్వానించాం. ఫీజు రీయింబర్స్ విషయంలో వైఎస్సార్‌తో అనేక సార్లు సమీక్షించి దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాన్ని రూపొందించారు. అనేక హాస్టళ్లు, గురుకులాల ఏర్పాటుకు కృషిచేయటమే కాకుండా, ధరలకు అనుగుణంగా విద్యార్థుల స్కాలర్ షిప్‌లు అమలుకు కృష్ణయ్య కృషిచేశారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది' అని అన్నారు.

బీసీలకు వైఎస్సార్‌ చేసిన మేలు అంతా ఇంతా కాదని ఆర్‌ కృష్ణయ్య అన్నారు. 'బీసీలు ఏం కోరితే అది కాదనకుండా ఇచ్చారు. ఎంత ఫీజు ఉంటే అంత రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చిన మంచి మనిషి. 300 హాస్టళ్లు, విద్యార్థినిలకు హాస్టళ్లు, మెయింటెనెన్స్‌ చార్జీలు అన్నీ ఇచ్చారు. ఉన్నత చదువులు చదివి ఆకుటుంబాలు బాగుపడాలని రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు. తండ్రికి తగ్గ తనయుడు వైఎస్‌ జగన్. ఆయనలానే బీసీలంటే వైఎస్‌ జగన్‌కి ప్రేమ. దేశవ్యాప్తంగా 36 పార్టీలను బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరితే, స్పందించింది కేవలం వైఎస్సార్‌సీపీ ఒక్కటే. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి మరీ ఈ అంశం పార్లమెంట్‌లో చర్చకు కృషిచేశారు. వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. తప్పని సరిగా వైఎస్సార్‌సీపీ బీసీ గర్జనకు హాజరవుతా. వైఎస్సార్‌సీపీ గెలిస్తేనే నా జీవిత ఆశయం చట్టసభల్లో రిజర్వేషన్ల అంశం ముందుకెళుతుందని భావిస్తున్నా' అని కృష్ణయ్య అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top