రహదారులకు పుష్కర శోభ | Pushkar roads Charm | Sakshi
Sakshi News home page

రహదారులకు పుష్కర శోభ

Dec 17 2014 1:11 AM | Updated on Sep 2 2017 6:16 PM

నాలుగు నెలల చర్చోపచర్చల అనంతరం ప్రభుత్వం పుష్కరాల దిశగా తొలి అడుగు వేసి రహదారుల నిర్మాణానికి ఉత్తర్వులిచ్చింది.

 సాక్షి, రాజమండ్రి :నాలుగు నెలల చర్చోపచర్చల అనంతరం ప్రభుత్వం పుష్కరాల దిశగా తొలి అడుగు వేసి రహదారుల నిర్మాణానికి ఉత్తర్వులిచ్చింది. పుష్కర పనుల్లో భాగంగా  ఉభయగోదావరి జిల్లాల్లో రూ.133 కోట్లతో రోడ్ల పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. వీటిలో రూ. 87.55 కోట్లను మన జిల్లాలో 17 పనులు చేపట్టేందుకు కేటాయించారు. జిల్లాలో ప్రధానంగా పుష్కరాలకు భక్తుల తాకిడి ఉండే ప్రాంతాల్లో ఉన్న రహదారులకు ఈ నిధులు విడుదల చేశారు. పనులు 2015 జూన్ నాటికి పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  
 
 ఈ రోడ్లకే కొత్త రూపు..
 ఆలమూరు నుంచి కోటిపల్లి వరకూ 17 కిలోమీటర్ల రహదారిని రూ.9.90 కోట్లతో అభివృద్ధి చేస్తారు. ఆలమూరు నుంచి కోటిపల్లి మధ్యలో ఆరు కిలోమీటర్లు, కోటిపల్లి నుంచి పిల్లంక వరకూ తొమ్మిది కిలో మీటర్ల రోడ్లను రూ. 9.75 కోట్లతో మరమ్మతు చేస్తారు. అమలాపురం నుంచి నేదునూరు మీదుగా అయినవిల్లికి కలిపే రోడ్డును 8.6 కిలోమీటర్ల మేర రూ.ఆరు కోట్లతో మరమ్మతు చేస్తారు. టేకిశెట్టిపాలెం నుంచి అంతర్వేదికి వెళ్లే 13.4 కిలోమీటర్ల రోడ్డును రూ.3.90 కోట్లతో అభివృద్ధి చేస్తారు. సఖినేటిపల్లి నుంచి అంతర్వేది  రోడ్లో 11 కిలోమీటర్లను రూ.3.40 కోట్లతో మెరుగుపరుస్తారు. రాజమండ్రి నగర పరిధిలో 1.5 కిలోమీటర్ల మేర పాైడె న బైపాస్ రోడ్డుకు రూ.1.30 కోట్లతో మరమ్మతులు చేస్తారు. రాజమండ్రి నుంచి సీతానగరం మండలం చినకొండేపూడి వరకూ 24 కిలోమీటర్ల రోడ్డును రూ.8.00 కోట్లతో అభివృద్ధి చేస్తారు. మామిడికుదురు నుంచి గోగన్నమఠం వరకూ ఏడున్నర కిలోమీటర్ల రోడ్డును రూ. 3.45 కోట్లతో అభివృద్ధి పరుస్తారు. కోటిపల్లి నుంచి పిల్లంక వరకూ 4.5 కిలోమీటర్లు, పిల్లంక నుంచి యానాం వరకూ 5.3 కిలోమీటర్ల రోడ్ల బాగుకు రూ.7.80 కోట్లు వెచ్చిస్తారు. బాలాంత్రం నుంచి బ్రహ్మపూడి వరకూ సుమారు ఆరు కిలోమీటర్ల రోడ్డును రూ.4.00 కోట్లతో అభివృద్ధి చేస్తారు.
 
 రోడ్‌కం రైలు వంతెనకు రూ.3 కోట్లు
 రాజమండ్రి-కొవ్వూరు మధ్య గోదావరిపై ఉన్న  రోడ్డు కం రైలు వంతెన ప్రత్యేక మరమ్మతులకు రూ.3.00 కోట్లు కేటాయించారు. ఈ వంతెన నుంచి ధవళేశ్వరం కాటన్ గెస్ట్‌హౌస్ వరకూ గోదావరి గట్టు రోడ్డును 7.5 కిలోమీటర్ల మేర వెడల్పుచేసి పటిష్ట పరిచేందుకు రూ.3.5 కోట్లు కేటాయించారు. రాజమండ్రి నగర పరిధిలోని హకుంపేట రోడ్డును రెండు కిలోమీటర్ల మేర రూ.మూడు కోట్లతో వెడల్పు చేస్తారు. రాజమండ్రి నుంచి ముగ్గళ్ల వరకూ గోదావరి గట్టు రోడ్డు 14 కిలోమీటర్ల మేర మరమ్మతులకు రూ.3.15 కోట్లు వెచ్చించనున్నారు.
 
 రూ.17.40 కోట్లతో ఏపీఆర్‌డీసీ పనులు
 ఆర్‌అండ్‌బీ శాఖకు అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రి-కాకినాడ రోడ్డును రూ.10 కోట్లతో ఏడు కిలోమీటర్ల మేర  అభివృద్ధి చేయనున్నారు. రాజమండ్రి- మారేడుమిల్లి రోడ్డుకు నగరం శివార్లో ఐదు కిలోమీటర్ల మేర రూ.5.10 కోట్లతో మరమ్మతులు చేస్తారు. ద్వారపూడి-యానాం వెళ్లే రోడ్డుకు ద్రాక్షారామ పరిధిలో రూ.2.30 కోట్లతో మరమ్మతులు చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement