బండారుకు పంచగ్రామాల సెగ

Protests In Janmabhoomi Maa vooru Programme Visakhapatnam - Sakshi

దేవస్థానం భూసమస్యపై నిలదీసిన సమైక్య ప్రజారైతు సంక్షేమ సంఘం నాయకులు

ఎమ్మెల్యే ఆదేశాలతో ఆందోళనకారులను ఈడ్చుకుపోయిన పోలీసులు

అడవివరం జన్మభూమి సభలో ఘటన

నిరసనలు, నిలదీతల మధ్య సాగుతున్న గ్రామసభలు

అయ్యన్న ‘మందు’పురాణం

సాక్షి, విశాఖపట్నం: విసిగివేసారిన ప్రజలకు జన్మభూమి మావూరు అందివచ్చిన అస్త్రంగా మారింది. నాలుగున్నరేళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలనే కాదు.. గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని ఎండగట్టే వేదికైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ జన్మభూమి గ్రామసభల వేదికగా ఉతికారేస్తున్నారు. ఆక్రో శం పట్టలేక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలపై నోరుచేసుకోవడమే కాదు.. ఖాకీలను ఉసిగొల్పి అరెస్టులు చేయిస్తున్నారు. దీంతో గ్రామసభలు రసాభాసగా మారుతున్నాయి.æ జీవీఎంసీ 34వ వార్డు తాటిచెట్లపాలంలో జరిగిన గ్రామసభలో గందరగోళం చోటు చేసుకుంది. స్థానికులను కాదని స్థానికేతరులకు ఇక్కడ ప్రాధాన్యతనిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు ఎదుట టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

జీవీఎంసీ 4వ వార్డు పీఎంపాలెం జరిగిన గ్రామసభలో జన్మభూమి కమిటీ పెత్తనంపై వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు గాదె రోశి రెడ్డి, జె.ఎస్‌.రెడ్డి, పార్టీ వార్డు అధ్యక్షుడు బొట్టా అప్పలరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దరఖాస్తులు ఇవ్వడం తప్పా తమకు పథకాలు మంజూరు కావడం లేదని స్థానికులు, వృద్ధులు అధికారులతో వాగ్వాదం చేశారు. ఇళ్ల పట్టాల కోసం ఇచ్చిన దరఖాస్తులను బుట్టదాఖలు చేశారని వాపోయారు. మళ్లీ దరఖాస్తులు ఇవ్వండి పరిశీలిస్తాం అని అనగా.. ఎందుకు మళ్లీ మూలన పడేయడానికా అంటూ మండిపడ్డారు.
ప్రభుత్వ పథకాలు గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప, ప్రజలకు చేసిందేమిటని ఆనందపురం మండలం గంభీరం గ్రామసభలో ప్రజలు అధికారులను నిలదీశారు. సభ ప్రారంభం కాగానే ప్రభుత్వ గొప్పలు చెబుతుండగా స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులు బొట్టా రామకృష్ణ, ఉప్పాడ రామిరెడ్డి, గోవింద్‌ తదితరులతో పాటు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
చెప్పిన మాటలకు ఇచ్చిన హామీలకు పొంతన లేకుండా పథకాలు అందిస్తున్నారని ఎస్‌.రాయవరం మండలం పి.ధర్మవరం గ్రామస్తులు మండిపడ్డారు. మహిళలు ఎమ్మేల్యే చుట్టుముట్టి నిలదీశారు. ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి పట్టాలు మంజూరు చేయలేదని, ఇప్పుడు పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు వీలు కుదరడం లేదని వాపోయారు.
ఏళ్ల తరబడి ఉన్న కాలనీసమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోలేదు.. ఇకచేయలేమంటే చెప్పండి ఊరు వదిలి వెళ్లిపోతాంఅంటూ యాతపేటకాలనీ వాసులు చోడవరం మండలం నర్సాపురం గ్రామసభలో అధికారులను నిలదీశారు. పక్క కాలనీకి వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని, వీధిలైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కె.కోటపాడు మండలం కింతాడ గ్రామసభ రసాభాసగా మారింది. వేదికపై కూర్చున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడును గొల్లలపాలెంవాసులు చుట్టుముట్టి తమ సమస్యలను ఎకరవుపెట్టారు. ఏడాదిగా మంచినీటి పథకం మూలకు చేరిందని, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రావికమతం మండలం టి. అర్జాపురం సభలో సమస్యలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిలదీశాయి. దీంతో టీడీపీ, వైఎస్సార్‌ సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు వారించారు.
మత్స్యగుండం రోడ్డు అభివృద్ధిలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హుకుంపేట మండలం మఠం పంచాయతీ గిరిజనులు జన్మభూమి సభను అడ్డుకున్నారు. మఠం జంక్షన్‌లో పెద్ద సంఖ్యలో మూడు గంటల పాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ పీవో కూడా రోడ్డు అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. అధి కారులంతా రోడ్డుపైనే గంటల తరబడి నిరీక్షిం చారు. ఐటీడీఏ పీవో మధ్యాహ్నం 12గంటలకు అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో చర్చలు జరిపారు.శివరాత్రి పండగ సమయానికి రోడ్డు నిర్మిస్తామన్న హమీ తో గిరిజనులు ఆందోళన విరమించారు. అరకులోయ మండలం సుంకరమెట్టలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎంనాయకులు, ఇతర గిరిజనులు డిమాండ్‌ చేశారు. ముంచంగిపుట్టు మండలం లక్ష్మిపురంలో నిర్వహించిన జన్మభూమి సభలో ఉపాధి కూలి బకాయిలు వెంటనే చెల్లించాలని గిరిజనులు అధికారులను నిలదీశారు. బరడలో నిర్వహించిన జన్మభూమిలోనూ తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజనులంతా ఆందోళన చేపట్టారు.

సింహాచలం(పెందుర్తి): ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి పంచగ్రామాల భూసమస్య సెగ తగిలింది. అడవివరంలో జరిగిన జన్మభూమి సభలో ఆయనను బాధిత ప్రజలు నిలదీశారు. దేవస్థానం భూసమస్యను అధి కారంలోకి వచ్చిన వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లు దాటినా పట్టించుకోలేదని, అబద్ధాలు చెబుతూ రైతులను, ప్రజ లను మోసం చేస్తున్నారని ఆయనను సమైక్య రైతు సంక్షేమ సంఘం నాయకులు నిలదీశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు గడిచిన ఐదు జన్మభూమి కార్యక్రమాలకు హాజ రవ్వకుండా తప్పించుకున్నారని దుయ్యబట్టా రు. ఉదయం 11 సమయంలో ప్రారంభమైన జన్మభూమి వేదికపై బండారు మాట్లాడే సమయానికి సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం నాయకులు, రైతులు, బాధితులు ప్లకార్డులతో లేచి నినా దాలు చేశారు. భూసమస్య పరిష్కారం అవుతుందని హామీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, అబద్ధాలు ఆడుతున్నారని రైతు సం ఘం ప్రధాన కార్యదర్శి టి.వి.కృష్ణంరాజు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.రమణి ఎమ్మెల్యేను నిలదీశా రు. ఎమ్మెల్యే బండారు డౌన్‌ డౌన్‌.. మంత్రి గంటా డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

జన్మభూమి ప్రాంగణం రసాభాసగా మారింది. అసలు సమస్యకు కారణమే కమ్యూనిస్టులని, సమస్య పరి ష్కారం కాకుండా శారదాపీఠం స్వామీజీ, జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ అడ్డుపడుతున్నారని, వారి ని ప్రశ్నించాలని ఎమ్మెల్యే బండారు అనేసరికి.. రైతు సంఘం నాయకులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మె ల్యే తీరును ఎండగట్టారు. భూసమస్యను పరి ష్కరిస్తామని మోసం చేసిన ఎమ్మె ల్యే బండారు అంటూ సభాప్రాంగణాన్ని నినా దాలతో హోరెత్తించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బండారు వారిని బయటకు పం పించండంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు రైతు సంఘం నాయకులను ఈడ్చుకుంటూ సభాప్రాంగణం నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం సభా ప్రాంగణానికి సమీపంలోనే ఉన్న ఎమ్మెల్యే కారు దగ్గరకు చేరుకుని నినాదాలు చేశారారు. ఎమ్మెల్యే కారు ఎక్కకుండా అడ్డుకుందామని ప్రయత్నాలు చేశారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే కారును రెండు, మూడు ప్రదేశాలకు పోలీసులు పంపిం చగా.. అక్కడికి కూడా పరుగులు తీస్తూ రైతు సంఘం నాయకులు చేరుకుని నిరసన తెలిపా రు. చేసేదిలేక పోలీసులు ఎమ్మెల్యేను బందోబస్తు మధ్య తీసుకెళ్లి కారు ఎక్కి పంపించేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top