కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతులు రాష్ట్ర ప్రభుత్వ పాలనలో భాగస్వాములైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసన మండలి సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.
ఒంగోలు వన్‌టౌన్ : కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతులు రాష్ట్ర ప్రభుత్వ పాలనలో భాగస్వాములైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసన మండలి సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. సోమవారం యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సమావేశానికి యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.రమణారెడ్డి అధ్యక్షత వహించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మేధావుల్లో చర్చ జరగాలని విఠపు బాలసుబ్రహ్మణ్యం సూచించారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో పని చేస్తున్న బోధకులకు వేతనాలు పెంచాలని, మోడల్ స్కూళ్లలో రెగ్యులర్ నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ డి.రామిరెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా పారిశ్రామికవాడగా, విద్యావనరుల కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలకు పెంచటం హర్షణీయమైనప్పటికీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మీగడ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో యూటీఎఫ్ చురుకైన పాత్రను పోషించాలని సూచించారు.
తీర్మానాలు
సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. విద్యాశాఖాధికారి కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం సీనియారిటీ జాబితాను ప్రకటించాలని, ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ అమలు చేయాలని తీర్మానించారు. పీఆర్‌సీ నివేదికపై చర్చించి వెంటనే అమలు చేయాలని కోరారు. గత ఏడాది జూన్, జులైలో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల బకాయిల చెల్లింపునకు నిధులు మంజూరు చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ ప్రకటించాలని కోరారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆనంద్, పూర్ణను అభినందించారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి జి.హరిబాబు, సహాధ్యక్షుడు పి.వీరాంజనేయులు, కె.కృష్ణమూర్తి, పి.జాన్‌విలియమ్ తదితరులు పాల్గొన్నారు.