
విద్యార్థుల పుస్తకాల సంచి బరువును కొలుస్తున్న ఎంఈవో ప్రభాకర్‌రావు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని 40 ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న విధానం
స్కూల్ బ్యాగు బరువు ఎక్కువుంటే తూకం వేసి అదనపు పుస్తకాలు తొలగింపు
పిల్లలకు రెండేసి జతల పాఠ్య పుస్తకాలు అందజేత.. ఒక సెట్ బడిలో మరో జత ఇంట్లో..
విద్యార్థులకు తగ్గిన భుజం,నడుం నొప్పులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: స్కూల్ విద్యార్థులు నిత్యం బండెడు పుస్తకాలున్న బ్యాగ్‌లను భుజాన మోసుకుంటూ వెళ్లడం పరిపాటే. కానీ కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిధిలోని సుమారు 40 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన, వినూత్న విధానం అమలవుతోంది. అక్కడి బడుల్లో కిలోల కొద్దీ పుస్తకాలను మోయలేక మోస్తూ బడికి వచ్చే విద్యార్థులు కనిపించరు.
కేవలం చిన్నపాటి బడి సంచితో బడికివచ్చే బాలలే ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఎక్కువ పుస్తకాలు తెస్తే వెంటనే అదనపు బరువును ఉపాధ్యాయులు తొలగించేస్తారు. ఇందుకోసం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. దీంతో విద్యార్థులు ఆయా పాఠశాలలకు వెళ్లడాన్ని భారంగా భావించట్లేదు.
గతేడాది నుంచే..: గంగాధర మండలం ఎంఈవో ఏనుగు ప్రభాకర్‌రావు గతేడాది ఒద్యారం స్కూల్ హెంఎంగా, ఎంఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ సమయంలో పలువురు విద్యార్థులు అధిక బరువుతో ఉన్న బ్యాగులతో బడికి రావడాన్ని ఆయన గమనించారు. వారిలో పలువురు పిల్లల భుజాలు, నడుములు ఒంగిపోవడం, నడకలో మార్పు రావడం, కాళ్ల ఆకారంలో మార్పులు ఉండటాన్ని గుర్తించారు.
ఈ సమస్యను అధిగమించేందుకు పుస్తకాల బరువును తగ్గించాలని నిర్ణయించారు. ఇందుకోసం స్కూలు ఆవరణలోనే త్రాసు ఏర్పాటు చేశారు. అక్కడ విద్యాశాఖ నిర్దేశించిన ప్రకారం.. ఏ విద్యార్థి ఎంత బరువు మోయాలనే సూచనల ఆధారంగా అంతే బరువు ఉండేలా అదనపు పుస్తకాలను తప్పించారు.
రెండు జతల పుస్తకాలు..
విద్యార్థులు టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్‌ను సూŠక్‌ల్‌కు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉండటంతో బ్యాగుల బరువు పెరుగుతోంది. అందుకే బ్యాగుల బరువు తగ్గించేలా గత విద్యాసంవత్సరం ముగింపు సందర్భంగా హైస్కూలు పిల్లల పాఠ్యపుస్తకాలను సేకరించి వాటిని ఈ ఏడాది ప్రతి విద్యార్థికీ అదనపు సెట్ కింద అందించారు. దీనివల్ల విద్యార్థులు ఇంటి వద్ద పాత పుస్తకాలను, బడిలో కొత్త పాఠ్యపుస్తకాలను ఉంచుతున్నారు. ఫలితంగా వారికి పాఠ్యపుస్తకాలను మోసుకెళ్లే బాధ తప్పింది. అలాగే హోంవర్క్, ఫెయిర్ నోట్స్‌ను మాత్రమే పిల్లలు తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు.
హాయిగా ఉంది
పుస్తకాల బరువు తగ్గించాక చాలా హాయిగా ఉంది. అంతకుముందు దాదాపు 9 కిలోల బ్యాగ్ మోయాల్సి వచ్చేది. ఇప్పుడు తక్కువ పుస్తకాలతో స్కూల్‌కు వెళ్తున్నా. నెత్తి, భుజం నొప్పులు తగ్గిపోయాయి.
– ఎం.శ్రావ్య, 8వ తరగతి, జెడ్పీ హెచ్ ఎస్, ఒద్యారం
నడుం నొప్పి పోయింది
గతంలో బ్యాగు బరువు వల్ల అమ్మానాన్న దిగబెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరమైన పుస్తకాలనే తీసుకెళ్తుండటం వల్ల బ్యాగు బరువు తగ్గింది. అందుకే మేమే తీసుకెళ్లగలుగుతున్నాం. ఇప్పుడు నడుం నొప్పి, భుజాల నొప్పి లేవు.
– రామంచ హర్షిత 10వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, గట్టుబూత్కూరు, గంగాధర మండలం