
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదులో భారీ తగ్గుదల
తెలంగాణలో రెండేళ్లలో 5,23,986 మంది తగ్గిన వైనం
ఉత్తరప్రదేశ్‌లో 31.88 లక్షలు.. రాజస్థాన్‌లో 15.31 లక్షలమంది గుడ్‌బై
చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.. 1.58 కోట్ల మంది సర్కారు బడులకు దూరం
సర్వ శిక్ష అభియాన్ కింద అధునాతన వసతులు.. అయినా కార్పొరేట్‌ల వైపే మొగ్గు
యూడీఐఎస్‌ఈ నివేదికల ఆధారంగా వెల్లడి
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో (గవర్నమెంట్, లోకల్ బాడీ) చేరుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. సర్కారు బడుల్లో అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు, డిజిటల్ పద్ధతిలో బోధన చేస్తున్నా కార్పొరేట్ స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2019–20 నుంచి 2021–22 వరకు సర్కారు బడుల్లో పెరిగిన ఎన్‌రోల్‌మెంట్.. ఆ తర్వాత 2022–23, 2023–24ల వరకు వచ్చే సరికి గణనీయంగా పడిపోయింది.
2024–25లో కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల చేరిక ఆశాజనకంగా లేదని యూనిఫైడ్ డిస్టిక్ట్ర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్‌ఇ) నివేదికలు చెబుతున్నాయి. 2019–20 నుంచి 2023–24ల వరకు ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా సర్కారు బడుల్లో నమోదైన విద్యార్థుల గణాంకాలను రెండు రోజుల కిందట కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. 2021–22 సంవత్సరంలో నమోదైన విద్యార్థుల సంఖ్య.. 2023–24లోని సంఖ్యతో పోలిస్తే రెండు సంవత్సరాల్లో 1,57,50,281 మంది తగ్గారు.
దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి..
ఏటేటా సర్కారు బడుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2019–20లో 13,09,31,634 మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా సర్కారు బడుల్లో ఉంటే.. 2020–21 నాటికి ఆ సంఖ్య 13,49,04,560లకు చేరింది. మరుసటి సంవత్సరం 2021–22లో 14,32,40,480 లకు పెరగ్గా ఆ తర్వాత నుంచి ఎన్‌రోల్‌మెంట్ తగ్గింది. 2022–23లో 13,62,04,917లు కాగా, 2023–24 నాటికి 12,74,90,199లకు పడిపోయినట్లు రికార్డులు చెప్తున్నా యి.
ఈ లెక్కన అత్యధికంగా రెండేళ్లలో బిహార్‌లో 45,22,871, ఉత్తరప్రదేశ్‌లో 31,88,070, రాజస్థాన్‌లో 15,30,705, మధ్యప్రదేశ్‌లో 7,57,974, తెలంగాణలో 5,23,986 మంది సర్కారు బడులకు దూరం అయ్యారు. ఒడిశా, లక్షదీప్‌లు మినహా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి పలు రాష్ట్రాల్లో ఎన్‌రోల్‌మెంట్ గణనీయంగా తగ్గింది.
ఉమ్మడి వరంగల్‌లో మూతబడులు
రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు మొత్తం 18,254 ఉండగా.. వాటిల్లో 6,90,816 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఒక్కో బడిలో సగటు పిల్లల సంఖ్య 38 మాత్రమే. ఏకంగా 1,864 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి లేనట్లు అప్పట్లో అధికా రులు ప్రకటించడం గమనార్హం. కాగా ఉమ్మడి వరంగల్‌లోనూ 298 వరకు ప్రభుత్వ పాఠశాల లు మూత బడినట్లు అధికారులు పేర్కొన్నారు. సర్కారు బడుల్లో సంఖ్య తగ్గడానికి గురుకు లాలు, మోడల్ స్కూళ్లు కారణమవగా.. ఏమాత్రం ఆర్థిక స్తోమత లేని వారు, గురుకులాల్లో సీట్లు దక్కని వారు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు బడుల్లో చేరుతున్నారని ఉపాధ్యా యులు చెప్తున్నారు.
కొంతమంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో నాణ్యత తక్కువగా ఉంటుందని భావించి, ప్రైవే టు పాఠశాలలకు ప్రాధాన్యం ఇస్తు న్నారన్న ప్రచారం కూడా ఉంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలు ఉండటం వల్ల కూడా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపడానికి ఇష్టపడటం కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెప్తున్నారు.
మూతబడులను పునఃప్రారంభించాలి
సర్కారు బడులకు పిల్లలు రావడం లేదని చాలాచోట్ల స్కూల్స్ మూసేస్తున్నారు. ఇదే కారణంతో నేను చదువుకున్న కుమ్మరికుంట తండా బడిని కూడా బంద్ చేశారు. పాఠశాలలో అన్ని వసతులు కల్పించి తిరిగి ప్రారంభించాలి. ఆ బడిని అన్ని వసతులతో మళ్లీ తెరిపిస్తే చాలామంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్నాం. జిల్లా పాలనాధికారులు విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలలను పునఃప్రారంభించాలి. – బానోత్ శ్రీను, కుమ్మరి కుంట తండా, మహబూబాబాద్ జిల్లా