ప్రైవేటుదే ఏలు‘బడి’! | Admissions to government schools have fallen | Sakshi
Sakshi News home page

ప్రైవేటుదే ఏలు‘బడి’!

Aug 29 2025 3:04 AM | Updated on Aug 29 2025 3:04 AM

Admissions to government schools have fallen

ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పతనం 

ప్రైవేటు స్కూళ్లలోనే చేరికలు అధికం

50.7శాతం ఎన్‌రోల్‌మెంట్‌తో ఆధిపత్యం   

కూటమి సర్కారు పాలన వైఫల్యానికి నిదర్శనం 

ప్రభుత్వ బడుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ 46.3 శాతమే!    

జాతీయ స్థాయి కన్నా తక్కువగా ప్రభుత్వ బడుల్లో చేరికలు   

సమగ్ర మాడ్యులర్‌ సర్వే–విద్య–2025 నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి: ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు బడులదే రాజ్యంగా మారింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విద్య అనే భేదం లేకుండా అన్ని స్థాయిల్లోనూ విద్యార్థులను ఆకర్షించే విషయంలో ప్రైవేటు స్కూళ్ల ఏలుబడి స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పతనమయ్యాయి.  

జాతీయ స్థాయిని మించి ప్రైవేటు స్కూళ్లలో చేరికలు ఉంటే ప్రభుత్వ బడుల్లో అంతకంత తగ్గుముఖం పట్టాయి.  ఈ విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య నిర్వహించిన సమగ్ర మాడ్యులర్‌ సర్వే–విద్య–2025 నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.  

మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసినా..! 
దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసినా ప్రభుత్వ ఉన్నత, సెకండరీ విద్యలో చేరికలు రాష్ట్రంలోనే చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ప్రైవేట్‌ ఉన్నత, సెకండరీ విద్యలో రాష్ట్రంలోనే అత్యధిక చేరికలు ఉన్నాయి. ఇది గాడి తప్పిన ప్రభుత్వ విద్యకు సంకేతం. కూటమి పాలన వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.  

వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వ బడులదే ఆధిపత్యం  
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సర్కారు విద్యా సంస్ధలకు అత్యధిక ప్రాధాన్యం దక్కింది. నూతన విప్లవాత్మక సంస్కరణల అమలుతోపాటు, మన బడి నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ బడులు కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి పథాన పయనించాయి. వసతుల కల్పనలో ముందంజలో నిలిచాయి. 

విద్యాబోధనలోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించాయి. ఫలితంగా ప్రైవేటు కంటే ప్రభుత్వ బడుల్లోనే చేరికలు అధికంగా నమోదయ్యాయి. అయితే కూటమి సర్కారు వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వ విద్యావ్యవస్థను నీరుగార్చింది. పాలకులు ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించడం వల్లే ప్రభుత్వ బడుల్లో చేరికలు తగ్గిపోయాయన్నది కేంద్ర నివేదిక చూస్తే ఇట్టే అర్థమైపోతోంది.  

నివేదికలోని అంశాలివే..!
జాతీయ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు 55.9 శాతం ఉండగా  రాష్ట్రంలో 46.3 శాతమే చేరికలు ఉన్నాయి. బిహార్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ బడుల్లో చేరికలు తక్కువగా ఉన్నాయి.  
»  జాతీయ స్థాయిలో ప్రైవేట్‌ స్కూళ్లలో చేరికలు 31.9 శాతమే ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయిని మించి ఏకంగా 50.7 శాతం చేరికలు ఉండడం గమనార్హం.   
»  రాష్ట్రంలోని పట్టణాల్లో ప్రభుత్వ స్కూళ్లలో కేవలం రూ.25.9 శాతమే చేరికలు ఉండగా ప్రైవేట్‌ స్కూళ్లలో 71.6 శాతం చేరికలు ఉన్నా­యి. పట్టణాల్లో ప్రైవేటు స్కూళ్లదే పూర్తి ఆధిపత్య­మని ఈ గణాంకాలు స్పష్టం చేస్తు­న్నా­యి.
» రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు 58 శాతం ఉన్నప్పటికీ ఇది జాతీయ స్థాయి(66.0శాతం) కంటే తక్కువగానే ఉండడం గమనార్హం.  
»  రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల ప్రైవేట్‌ స్కూళ్లలో 38.8 శాతం చేరికలు ఉన్నాయి.   
»  రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత సెకండరీ విద్యలో చేరికలు 25.7 శాతమే ఉండగా అదే జాతీయ స్థాయిలో ప్రభుత్వ సంస్థల్లో చేరికలు  51.3 శాతంగా ఉన్నాయి.  
»  రాష్ట్రంలో ప్రైవేట్‌ ఉన్నత సెకండరీ విద్యలో చేరికలు ఏకంగా 69.4 శాతం ఉండగా అదే జాతీయ స్థాయిలో చేరికలు కేవలం 31.4 శాతమే ఉన్నాయి. అంటే జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలోనే ప్రైవేట్‌ రంగంలో చేరికలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement