
ఇప్పటికే 210 పాఠశాలల్లో నిర్వహణకు సర్కారు సూచన
తాజాగా మరో 790 సూళ్లు గుర్తింపు
తరగతుల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ
నాలుగేళ్లు నిండిన చిన్నారులకు ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య అమలుకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించాలని ఇప్పటికే సూచించగా.. తాజాగా మరో 790 పాఠశాలలను గుర్తిస్తూ వాటిల్లో ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఆయా పాఠశాలల జాబితాను కూడా వెల్లడించింది. ప్రీ ప్రైమరీ అమలుకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.33 కోట్లు కేటాయించింది. తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ)లో వినియోగించని నిధి నుంచి రూ.22.62 కోట్లు తీసుకోవాలని, మిగిలిన మొత్తాన్ని సమగ్రశిక్ష నుంచి విడుదల చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. కాగా ప్రీ ప్రైమరీ నిర్వహణ మార్గదర్శకాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపారు.
ఆహ్లాదపరిచే గది.. పోషకాహారం.. మధ్యాహ్న భోజనం
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. నిర్దేశించిన పాఠశాలలో ప్రీ ప్రైమరీ కోసం ప్రత్యేకంగా తరగతి గది కేటాయించాలి. ఇది చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చేలా ఉండాలి. అంగన్‌వాడీల్లో అందించే పోషకాలతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా అందించాలి.
నాలుగేళ్లు నిండిన చిన్నారులను మాత్రమే ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చుకోవాలి. అంటే వచ్చే విద్యా సంవత్సరం (2026–27)లో ఒకటో తరగతిలో చేరే పిల్లలకు మాత్రమే ప్రవేశం కలి్పస్తారు. ప్రీ ప్రైమరీలో చేరే విద్యార్థి వివరాలను యూడైస్‌లో రికార్డు చేస్తారు.
ఒక టీచర్.. ఒక ఆయా
⇒ తరగతి నిర్వహణకు ప్రత్యే కంగా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న ఒక టీచర్, ఒక ఆయాను పూర్తి తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలి. నోటిఫికేషన్ ద్వారా నియామకం చేపట్టాలి. వయో పరిమితి సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాలి. టీచర్ కనీసం ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఉండాలి. ఆయా కనీసం ఏడో తరగతి చదివి ఉండాలి. ప్రీ ప్రైమరీ కోర్సు చేసిన వారికి, స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
⇒ తరగతి గదిలో ఇండోర్, అవుట్ డోర్ క్రీడా సామగ్రి ఏర్పాటు చేయాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆమోదంతో వసతులు కల్పించాలి.
⇒ ఎన్‌ఈపీ (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ)–20కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
⇒ రోజువారీ హాజరు స్వీకరించాలి. అంగన్‌వాడీల ద్వారా స్నాక్స్ పంపిణీ, మధ్యాహ్న భోజనం అమలు చేయాలి.
⇒ జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ ఆమోదంతోనే సరుకులు, వస్తువులు కొనుగోలు చేయాలి
⇒ ఈ తరగతి నిర్వహణకు స్థానికులు, తల్లిదండ్రుల సలహాలను స్వీకరించాలి
⇒ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉండాలి. రోజువారీ నిర్వహణ, పౌష్టికాహారం, ఆరోగ్యం, రక్షణ తదితరాలకు హెచ్‌ఎం బాధ్యత వహించాలి.
⇒ ఈ తరగతుల నిర్వహణను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయం చేస్తారు.