ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేయాలని సాంఘిక సంక్షమ శాఖ డిప్యూటీ డైరక్టర్ కే సరస్వతి అన్నారు.
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేయాలని సాంఘిక సంక్షమ శాఖ డిప్యూటీ డైరక్టర్ కే సరస్వతి అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్‌లో జిల్లాలోని అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ జిల్లాలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత ఉన్న విద్యార్థులు 40 వేల మంది ఉండగా కేవలం 5 వేల మంది మాత్రమే ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. వసతి గృహ సంక్షే మ అధికారులు తమకు కేటాయించిన 30 పాఠశాలల్లో విద్యార్థులను సందర్శించి వారంతా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని సూచించారు.
ఆధార్ ఎన్‌రోల్ అయి ఉండి ఆధార్ కార్డు లేని విద్యార్థులు తమ పాఠశాల ప్రిన్సిపాల్ లాగిన్ నుంచి ఈ- పాస్‌లో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం విద్యార్థులకు ఆధార్ కార్డులు వేగంగా అందేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదే విధంగా ఆధార్ కార్డులు లేని విద్యార్థులు 500 మంది ఉండవచ్చని ఒక అంచనాకు వచ్చామన్నారు. వీరందరికీ ప్రత్యేకంగా ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఐదు నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాజీవ్ విద్యా దీనెన పథకంలో దరఖాస్తు చేసుకునేలా పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో సంక్షేమ అధికారులు సమావేశాలు నిర్వహించాలన్నారు. వసతి గృహాల్లోని హాజరు, స్టాక్ వివరాలు, ఆన్‌లైన్ బిల్స్‌ను ఈ- హాస్టల్ మేనేజ్‌మెంట్ వ్యవ స్థ ద్వారా నిర్వహించాలన్నారు.
అదే విధంగా వసతి గృహాల్లో మెనూ తప్పనిసరిగా డిస్‌ప్లే చేయాలని, దాని ప్రకారం పిల్లలకు ఇవ్వాలన్నారు. కాస్మొటిక్ చార్జీలను విద్యార్థులకు అందించాలన్నారు. నూతన వసతి గృహాల నిర్మాణాలకు అనువైన స్థలాలు గుర్తించి వసతి గృహానికి కేటాయించేలా తహసీల్దార్‌లతో మాట్లాడాలన్నారు. పదో తరగతి ఫలితాలు నూరు శాతం సాధించే దిశగా సిబ్బంది కృషి చేయాలన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు, కార్పెట్లు అందాయో లేదో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులు పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో 8 మంది అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులు, 117 వసతి గృహ సంక్షేమ అధికారులు, 20 కళాశాలల వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.