రైల్వే స్టేషన్‌లో జరిమానాల దందా.! | Praking Collections In Vijayawada Railway Station | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్‌లో జరిమానాల దందా.!

May 21 2018 12:57 PM | Updated on May 21 2018 12:57 PM

Praking Collections In Vijayawada Railway Station - Sakshi

వాహనాలకు చైన్‌ వేసిన ప్రీమియం స్టాండ్‌ నిర్వాహకులు

విజయవాడ రైల్వే స్టేషన్‌లో జరిమానాల దందా యథేచ్ఛగా సాగుతోంది. నో పార్కింగ్‌ జోన్‌లో వాహనాలు పెట్టిన వారి నుంచి అక్కడి ప్రీమియం స్టాండ్‌ కాంట్రాక్టర్‌ ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తున్నారు. ఈ ఫైన్‌కు ఒక లెక్కా పత్రం ఉండదు.. రశీదు ఇవ్వరు.. దీంతో వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివారం ఇదే విధంగా కాంట్రాక్టర్‌కు, వాహనయజమానులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్‌ సౌత్‌ టెర్మినల్‌ వద్ద వాహనాల పార్కింగ్‌ కాంట్రాక్టర్, పోర్టర్ల హవా నడుస్తోంది. సౌత్‌ టెర్మినల్‌కు సమీపంలోని ఫ్లాట్‌ఫారాలపైకి పార్సిళ్లను తీసుకువెళ్లేందుకు ఒక ప్రత్యేక గేటు ఉంది. ఈ గేటులోంచి ఫ్లాట్‌ఫారాలపై వెళ్లడం సులభంగా ఉండటంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఈ గేటులోంచి లోపలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. అయితే కేవలం ట్రాలీలతో పార్సిళ్లు, సరుకు తీసుకువెళ్లేందుకు మాత్రమే ఈ గేటు ఉందని, ప్రయాణికులు వెళ్లేందుకు వీలు లేదంటూ పోర్టర్లు అడ్డుకుంటున్నారు.

నో పార్కింగ్‌ జోన్‌..
ఈ గేటు ప్రక్కనే ఒక టూ వీలర్‌ ప్రీమియం స్టాండ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ వాహనాన్ని పార్క్‌ చేస్తే గంటకు రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో టెర్మినల్‌ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాన్ని అధికారులు నో–పార్కింగ్‌ జోన్‌గా ప్రకటించారు. అయితే సౌత్‌ టెర్మినల్‌ వైపు తమ బంధువుల్ని రైలు ఎక్కించేందుకు వచ్చే వారు హడావుడిగా నో పార్కింగ్‌ బోర్డును చూసుకోకుండా అక్కడ తమ ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం ఆరు గంటలకు నగరం నుంచి బయలుదేరే రత్నాచల్, శాతవాహన, పినాకిని రైళ్లు ఎక్కించేందుకు వచ్చే వారు హడావుడిగా ఇక్కడే వాహనాలను ఇక్కడ పార్కింగ్‌ చేస్తున్నారు.

కాంట్రాక్టర్‌ ‘ప్రత్యేక జరిమానా’
వాస్తవంగా ఇక్కడ వాహనాన్ని పార్కింగ్‌ చేస్తే రూ.500 జరిమానా వేస్తామని అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిని ఇక్కడి కాంట్రాక్టర్‌ అదునుగా చేసుకుని దందాకు తెరలేపారు. హడావుడిగా వచ్చి ఇక్కడ వాహనం పార్కింగ్‌ చేయగానే వాహనాలన్నింటిని కలిపి చైన్‌ వేస్తున్నారు. చైన్‌ తీయడానికి ఒక్కొక్క వాహనానికి రూ.100 నుంచి రూ.150 వరకూ వసూలు చేస్తున్నారు. ఈ వసూలుకు ఏ విధమైన రశీదు ఇవ్వడం లేదు. అదేమని ప్రశ్నిస్తే రూ.500 బోర్డు చూపించి అది ఇస్తే రశీదు ఇస్తామని చెబుతుండటం గమనార్హం.

వాగ్వివాదం..
ఆదివారం ఉదయం తమ వాహనాలకు చైన్‌ వేయడంపై కొంతమంది వాహన యజమానులు కాంట్రాక్టర్‌తో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. అయితే జరిమానా చెల్లించాల్సిందేనని కచ్చితంగా చెప్పడంతో కొంతమంది గత్యంతరం లేక జరిమానా చెల్లించి వాహనాలను తీసుకున్నారు.

రూ.150 చెల్లించా..
మా బంధువులను రైలు ఎక్కించేందుకు వచ్చా. రైలు వెళ్లిపోతుందేమోనన్న హడావుడిలో నో పార్కింగ్‌ బోర్డు చూసుకోకుండా స్కూటర్‌ పార్క్‌ చేసి వెళ్లాను. తిరిగి ఐదు నిమిషాల్లో వచ్చాను. అయినా నా వద్ద రూ.150 వసూలు చేశారు.– రామాంజనేయులు, వాహనదారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement