కడుపు కొట్టిన కరెంటు...

Power Line Destroys Crop In Chittoor - Sakshi

సాక్షి, కేవీబీపురం(చిత్తూరు) : కరెంటు... ఆ రైతు కుటుంబాన్ని చితికిపోయేలా చేసింది. రెండేళ్ల క్రితం రైతు కుమారుడిని పొట్టన పెట్టుకున్న కరెంటు, ఈ పర్యాయం ఆ రైతు చెరకు తోటను బుగ్గి చేసింది. విధి విలాసమో, ట్రాన్స్‌కో నిర్లక్ష్యమోగానీ ఆ కుటుంబానికి మళ్లీ కోలుకోలేని దెబ్బపడింది. విద్యుత్‌ వైరు తెగి పడి చెరకుతోట దగ్ధమైన సంఘటన మంగళవారం మండలంలోని కోటమంగాపురంలో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన చవల సిద్ధయ్య మూడెకరాల్లో చెరకుతోట సాగు చేశాడు. పొలం మీదుగా ఉన్న 11 కేవీ విద్యుత్‌ వైరు తెగి తోటపై పడి అంటుకుంది. గాలుల వేగానికి, ఎండతీవ్రతకు క్షణాల వ్యవధిలో మంటలు వ్యాపించి తోట అగ్నికి ఆహుతైంది.

సుమారు రూ.3.50 లక్షల విలువచేసే పంట కాలిపోయింది. చేతికందివస్తున్న పంట ఇలా బుగ్గిఅవడంతో బాధిత రైతు కుటుంబం భోరున విలపించింది. రూ.2లక్షలు అప్పు చేసి పంట సాగు చేశారు. కళ్లెదుటే బుగ్గి అవుతున్న పంటను చూసి నిస్సహాయులయ్యారు. అప్పులే మిగిలాయని, ఒక దశలో ఆ మంట ల్లోకి దూకి బలవన్మరణం చెందేందుకు రైతు దంపతులు  యత్నించారు. స్థానికులు వారిని అడ్డుకున్నారు. వాస్తవానికి రెండేళ్ల క్రితం సిద్ధయ్య కుమారుడు ఇదే పొలంలో కరెంటు షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం వారి జీవితాన్ని అతలాకుతలం చేసింది. కాలిపోయిన చెరకతోటను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top