breaking news
Crop fire
-
sagubadi: గడ్డికి నిప్పు పెడితే ఏమవుతుందో తెలుసా?
పంట కోసిన తర్వాత గడ్డి లేదా కట్టెకు అక్కడే నిప్పు పెట్టేస్తుంటాం కదా.. పొగ వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని మనకు తెలుసు. అయితే, అంతకుమించి ఏమి నష్టం జరుగుతుందో మనకు తెలియదు. ‘సైన్స్ ఆఫ్ టోటల్ ఎన్విరాన్మెంట్’ జర్నల్‌లో ఇటీవల అచ్చయిన ఒక అధ్యయన పత్రం ఈ విషయాలను లోతుగా చర్చించింది. గడ్డిని కాల్చేస్తే ఆ భూమిలోని సూక్ష్మజీవరాశి జీవవైవిధ్యం నశించి, పొలం పర్యావరణ వ్యవస్థల సహజ క్రియలకు విఘాతం కలుగుతుందని ఈ అధ్యయనం వివరించింది. భారత్ సహా అనేక దేశాల్లోని పొలాల్లో గడ్డిని కాల్చటం వల్ల భూమికి, రైతుకు ఎలా నష్టం జరుగుతున్నదో తెలుసుకోవటానికి 250 అధ్యయన ఫలితాలను క్రోడీకరించి విశ్లేషించటం విశేషం.గడ్డిని తగులబెట్టినప్పుడు 33.8–42.2 డిగ్రీల సెల్సియస్ వరకు మట్టి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడికి మట్టిలోని నత్రజని నశిస్తుంది. సేంద్రియ పదార్థం తగ్గిపోతుంది. అంగుళం లోతు వరకూ ఉండే మట్టిలోని అపారమైన సూక్ష్మజీవులు చనిపోతాయి. అంతేకాదు, చీడపీడల బెడద పెరుగుతుంది. ఎరువు మరింత ఎక్కువ వేయాల్సి వస్తుంది. పొలంలో కనిపించే పురుగులను ఏరుకు తినేసే సాలీళ్లు, ఆరుద్ర పురుగులు, కప్పల సంఖ్య గడ్డీ గాదాన్ని తగులబెట్టిన పొలాల్లో పెద్దగా కనిపించవు. మంటపెట్టినప్పుడు వెలువడే అధిక ఉష్ణోగ్రత మట్టి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మట్టిలో ఉండే పోషకాలను మొక్కల వేర్లు తీసుకోగలిగే రూపంలోకి మార్చి అందించే అద్భుతమైన సహజ పోషణ వ్యవస్థ దెబ్బతింటుంది. గడ్డీగాదాన్ని కాలబెట్టకుండా నేలపై కప్పి ఆచ్ఛాదన చేయటం ఎన్ని విధాలా మేలో ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. -
కడుపు కొట్టిన కరెంటు...
సాక్షి, కేవీబీపురం(చిత్తూరు) : కరెంటు... ఆ రైతు కుటుంబాన్ని చితికిపోయేలా చేసింది. రెండేళ్ల క్రితం రైతు కుమారుడిని పొట్టన పెట్టుకున్న కరెంటు, ఈ పర్యాయం ఆ రైతు చెరకు తోటను బుగ్గి చేసింది. విధి విలాసమో, ట్రాన్స్‌కో నిర్లక్ష్యమోగానీ ఆ కుటుంబానికి మళ్లీ కోలుకోలేని దెబ్బపడింది. విద్యుత్ వైరు తెగి పడి చెరకుతోట దగ్ధమైన సంఘటన మంగళవారం మండలంలోని కోటమంగాపురంలో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన చవల సిద్ధయ్య మూడెకరాల్లో చెరకుతోట సాగు చేశాడు. పొలం మీదుగా ఉన్న 11 కేవీ విద్యుత్ వైరు తెగి తోటపై పడి అంటుకుంది. గాలుల వేగానికి, ఎండతీవ్రతకు క్షణాల వ్యవధిలో మంటలు వ్యాపించి తోట అగ్నికి ఆహుతైంది. సుమారు రూ.3.50 లక్షల విలువచేసే పంట కాలిపోయింది. చేతికందివస్తున్న పంట ఇలా బుగ్గిఅవడంతో బాధిత రైతు కుటుంబం భోరున విలపించింది. రూ.2లక్షలు అప్పు చేసి పంట సాగు చేశారు. కళ్లెదుటే బుగ్గి అవుతున్న పంటను చూసి నిస్సహాయులయ్యారు. అప్పులే మిగిలాయని, ఒక దశలో ఆ మంట ల్లోకి దూకి బలవన్మరణం చెందేందుకు రైతు దంపతులు యత్నించారు. స్థానికులు వారిని అడ్డుకున్నారు. వాస్తవానికి రెండేళ్ల క్రితం సిద్ధయ్య కుమారుడు ఇదే పొలంలో కరెంటు షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం వారి జీవితాన్ని అతలాకుతలం చేసింది. కాలిపోయిన చెరకతోటను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కరెంటు లేక పంటకు నిప్పు
బీర్కూర్: కరెంటు కోతలు రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన దాసరి లక్ష్మయ్య మూడు ఎకరాలు కౌలుకు తీసుకోని ఖరీఫ్‌లో నాట్లు వేశాడు. ఎకరానికి 12 బస్తాల చొప్పున కౌలు పెట్టాల్సి ఉంటుంది. పంట సాగు చేసేందుకు ఎకరానికి సుమారు రూ. 20 వేలు ఖర్చయింది. వానలు లేవు, కరెంటు సైతం తీవ్ర ఇబ్బందులు పెట్టింది. దీంతో పొట్ట దశకు వచ్చిన పంట కళ్లముందే ఎండిపోయింది. పంట పాలు తాగాల్సిన సమయంలో నీళ్లు లేకపోవడంతో పంట అంతా పొల్లు పోయింది. ఎండిన పంటను చూసి తట్టుకోలేక లక్ష్మయ్య పంటకు నిప్పు పెట్టాడు.