
పంట కోసిన తర్వాత గడ్డి లేదా కట్టెకు అక్కడే నిప్పు పెట్టేస్తుంటాం కదా.. పొగ వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని మనకు తెలుసు. అయితే, అంతకుమించి ఏమి నష్టం జరుగుతుందో మనకు తెలియదు.
‘సైన్స్ ఆఫ్ టోటల్ ఎన్విరాన్‌మెంట్’ జర్నల్‌లో ఇటీవల అచ్చయిన ఒక అధ్యయన పత్రం ఈ విషయాలను లోతుగా చర్చించింది. గడ్డిని కాల్చేస్తే ఆ భూమిలోని సూక్ష్మజీవరాశి జీవవైవిధ్యం నశించి, పొలం పర్యావరణ వ్యవస్థల సహజ క్రియలకు విఘాతం కలుగుతుందని ఈ అధ్యయనం వివరించింది. భారత్ సహా అనేక దేశాల్లోని పొలాల్లో గడ్డిని కాల్చటం వల్ల భూమికి, రైతుకు ఎలా నష్టం జరుగుతున్నదో తెలుసుకోవటానికి 250 అధ్యయన ఫలితాలను క్రోడీకరించి విశ్లేషించటం విశేషం.
గడ్డిని తగులబెట్టినప్పుడు 33.8–42.2 డిగ్రీల సెల్సియస్ వరకు మట్టి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడికి మట్టిలోని నత్రజని నశిస్తుంది. సేంద్రియ పదార్థం తగ్గిపోతుంది. అంగుళం లోతు వరకూ ఉండే మట్టిలోని అపారమైన సూక్ష్మజీవులు చనిపోతాయి. అంతేకాదు, చీడపీడల బెడద పెరుగుతుంది. ఎరువు మరింత ఎక్కువ వేయాల్సి వస్తుంది.
పొలంలో కనిపించే పురుగులను ఏరుకు తినేసే సాలీళ్లు, ఆరుద్ర పురుగులు, కప్పల సంఖ్య గడ్డీ గాదాన్ని తగులబెట్టిన పొలాల్లో పెద్దగా కనిపించవు. మంటపెట్టినప్పుడు వెలువడే అధిక ఉష్ణోగ్రత మట్టి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మట్టిలో ఉండే పోషకాలను మొక్కల వేర్లు తీసుకోగలిగే రూపంలోకి మార్చి అందించే అద్భుతమైన సహజ పోషణ వ్యవస్థ దెబ్బతింటుంది. గడ్డీగాదాన్ని కాలబెట్టకుండా నేలపై కప్పి ఆచ్ఛాదన చేయటం ఎన్ని విధాలా మేలో ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది.