షార్ట్‌సర్క్యూట్‌తో గ్రాసం దగ్ధం
లేపాక్షి : వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి షార్ట్‌సర్క్యూట్ జరగడంతో ట్రాక్టర్లో తీసుకెళుతున్న మొక్కజొన్న సొప్ప దగ్ధమైంది. ట్రాలీ కూడా పాక్షికంగా దెబ్బతింది. వివరాల్లోకెళితే... లేపాక్షి గ్రామపంచాయతీలోని గలిబిపల్లికి చెందిన రైతు అంజనరెడ్డి పాడి పశువుల కోసం మొక్కజొన్న సొప్పను ఇతరుల వద్ద రూ.5వేలకు కొనుగోలు చేశాడు. ఈ సొప్పను శుక్రవారం మధ్యాహ్నం శ్రీనివాసులుకు చెందిన ట్రాక్టర్లో వేసుకుని ఇంటికి బయల్దేరాడు. తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలను సొప్ప లోడుతో వెళుతున్న ట్రాక్టర్ తాకింది.
దీంతో తీగలు ఒకటికొకటి తగులుకుని షార్ట్‌సర్క్యూట్ జరిగి నిప్పురవ్వలు సొప్పపై పడ్డాయి. అంతే క్షణాల్లో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ఇంజిన్ నుంచి ట్రాలీని వేరుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాలీతోపాటు మొక్కజొన్న సొప్ప కాలిపోయాయి. దాదాపు రూ.60వేల నష్టం వాటిల్లిందని ట్రాక్టర్ యజమాని శ్రీనివాసులు వాపోయాడు. విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతుండడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్తులు తెలిపారు.