breaking news
Revenue officers Notices
-
కడుపు కొట్టిన కరెంటు...
సాక్షి, కేవీబీపురం(చిత్తూరు) : కరెంటు... ఆ రైతు కుటుంబాన్ని చితికిపోయేలా చేసింది. రెండేళ్ల క్రితం రైతు కుమారుడిని పొట్టన పెట్టుకున్న కరెంటు, ఈ పర్యాయం ఆ రైతు చెరకు తోటను బుగ్గి చేసింది. విధి విలాసమో, ట్రాన్స్‌కో నిర్లక్ష్యమోగానీ ఆ కుటుంబానికి మళ్లీ కోలుకోలేని దెబ్బపడింది. విద్యుత్ వైరు తెగి పడి చెరకుతోట దగ్ధమైన సంఘటన మంగళవారం మండలంలోని కోటమంగాపురంలో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన చవల సిద్ధయ్య మూడెకరాల్లో చెరకుతోట సాగు చేశాడు. పొలం మీదుగా ఉన్న 11 కేవీ విద్యుత్ వైరు తెగి తోటపై పడి అంటుకుంది. గాలుల వేగానికి, ఎండతీవ్రతకు క్షణాల వ్యవధిలో మంటలు వ్యాపించి తోట అగ్నికి ఆహుతైంది. సుమారు రూ.3.50 లక్షల విలువచేసే పంట కాలిపోయింది. చేతికందివస్తున్న పంట ఇలా బుగ్గిఅవడంతో బాధిత రైతు కుటుంబం భోరున విలపించింది. రూ.2లక్షలు అప్పు చేసి పంట సాగు చేశారు. కళ్లెదుటే బుగ్గి అవుతున్న పంటను చూసి నిస్సహాయులయ్యారు. అప్పులే మిగిలాయని, ఒక దశలో ఆ మంట ల్లోకి దూకి బలవన్మరణం చెందేందుకు రైతు దంపతులు యత్నించారు. స్థానికులు వారిని అడ్డుకున్నారు. వాస్తవానికి రెండేళ్ల క్రితం సిద్ధయ్య కుమారుడు ఇదే పొలంలో కరెంటు షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం వారి జీవితాన్ని అతలాకుతలం చేసింది. కాలిపోయిన చెరకతోటను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
గల్లా అనుచరుల దౌర్జన్యం
పుదిపట్లలో ఆగని అక్రమ నిర్మాణాలు అడ్డుకున్నందుకు దళితులపై దాడి అధికారులకు అక్రమ కట్టడానికో *లక్ష పుదిపట్లలో గల్లా అనుచరులు దళితులపై దాడికి తెగబడ్డారు. రద్దు చేసిన ఇందిరమ్మ పట్టాల్లో అక్రమ కట్టడాలను అడ్డుకున్నందుకు వెంటపడి మరీ ఇటుకలు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాడుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి రూరల్ : మండలంలోని పుదిపట్ల పంచాయతీలో ప్రభుత్వం రద్దు చేసిన ఇందిరమ్మ పట్టాల్లో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అడ్డుకున్న దళితులపై మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరులు దాడులకు తెగబడ్డారు. దాడుల్లో వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీరాములతో సహా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. రద్దు అయిన పట్టాలలో అక్రమ కట్టడాలను నిర్మించుకునేందుకు కట్టడానికో లక్ష రూపాయలు చొప్పున రెవెన్యూ అధికారులకు ముడుపులు అందుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎంపీటీసీ బడి సుధాయాదవ్ దౌర్జన్యాలు, భూ కబ్జాలను రెవెన్యూ అధికారులు అడ్డుకోలేక పోతున్నారని విమర్శిస్తున్నారు. అసలేం జరిగిందంటే ... పంచాయతీలోని సర్వే నంబర్ 521లో 2008లో 78కి పైగా ఇందిరమ్మ పట్టాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో అత్యధికం అనర్హులకు చేరినట్టు ఆరోపణలు రావడంతో 2009లో 54 పట్టాలను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం రద్దు చేసిన పట్టాల్లో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. 20 రోజుల కిందట గ్రామానికి చెందిన దళితులు వాటిని అడ్డుకున్నారు. శనివారం మరోసారి అక్రమ కట్టడాల నిర్మాణం చేపట్టడంతో దళితులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్మాణాలు ఆపాలని అక్రమార్కులను అడ్డుకున్నారు. దీంతో ఎంపీటీసీ బడి సుధాయాదవ్ అనుచరులు దళితులపై దాడులు చేశారు. అడ్డుకోవడానికి మీరెవరంటూ దుర్భాషలాడారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దళితులు అక్కడ నుంచి పేరూరులోని స్టాఫ్ క్వార్టర్స్ వద్దకు వెళ్లారు. బైక్‌లపై వెంబడించిన సుధాయాదవ్ అనుచరులు వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీరాములతో సహా తేజ, నాగరాజు, గోపి, కిరణ్‌లపై ఇటుకరాళ్లు, కర్రలతో దాడి చేశారు. దాడుల్లో శ్రీరాములుతోపాటు నాగరాజు, గోపిలకు తీవ్ర గాయాలయ్యాయి. సుధాయాదవ్తో పాటు అతని అనుచరులు రవీంద్ర, వెంకటముని, మునియాదవ్, బెల్లంకొండ రమేష్‌లు కులంపేరుతో దూషించి హత్యాయత్నానికి పాల్పడినట్లు గోపి ఎంఆర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరాములు అనుచరుల దాడి చేసినట్లు సుధా అనుచరుడు వెంకటముని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.