కొండంత అపరాధానికి  గోరంత నోటీసు

Potladurti Brothers Continues Their Illegal Miniing in Kadapa - Sakshi

అక్రమ మైనింగ్‌ను అరికట్టాల్సిన సమయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు. నాలుగేళ్లుగా కొండను  ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నా మౌనం దాల్చారు. ప్రభుత్వ ఆదాయానికి గణనీయంగా గండికొట్టి కోట్లాది రూపాయలు ఆర్జించిన తర్వాత నోటీసులిచ్చి సరిపెట్టారు. నిబంధనలు మేరకు అపరాధ రుసుం వసూలు చేయడానికి ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నారు. చిన్న తప్పునకే సామాన్యులపై విరుచుకుపడే అధికార యంత్రాంగం పోట్లదుర్తి బ్రదర్స్‌ పట్ల ఎప్పటిలా భక్తి చాటుకుంటూనే ఉన్నారు

సాక్షి, కడప : ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామంలో పోట్లదుర్తి బ్రదర్స్‌ క్రషర్‌ ఏర్పాటు చేసి కొండను కొల్లగొట్టారు. నాలుగేళ్లుగా ఎలాంటి మైనింగ్‌ అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా డైనమేట్లతో పేల్చి కంకర కొట్టారు. ఈ శబ్దాలకు చిన్నదుద్యాల గ్రామస్థుల ఇళ్లు నెర్రలుబారినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ప్రభుత్వం గణనీయంగా ఆదాయం కోల్పోతున్నా అధికారమత్తు నుంచి తేరుకోలేదు. పెద్దఎత్తున అక్రమ వ్యవహారం ఎప్పుడైనా మెడకు చుట్టుకుంటుందని భావించి ఎన్నికలు సమీపించడంతో నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. 

మైనింగ్‌ అనుమతులు లేకుండానే....
మైనింగ్‌ అనుమతులు లేకుండా పోట్లదుర్తి బ్రదర్స్‌ క్రషింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. పోట్లదుర్తికి చెందిన జి చెన్నకేశవనాయుడు (సురేష్‌నాయుడు బినామీ)కు చిన్నదుద్యాల గ్రామం సర్వే నంబర్‌ 242లో 10.11హెక్టార్లులో మైనింగ్‌ లీజు దక్కింది. 2015లో లీజు లభించినా మైనింగ్‌ అనుమతులు పొందలేదు. కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో నిమిత్తం లేకుండా అక్రమంగా మైనింగ్‌ కొనసాగించారు. గతేడాది నవంబర్‌ 30న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా మైనింగ్‌ చేస్తున్నారంటూ యర్రగుంట్ల మైనింగ్‌ ఏడీ నోటీసు మాత్రమే జారీ చేశారు. అవేవీ లెక్కచేయని పోట్లదుర్తి బ్రదర్స్‌ తమ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తూనే వచ్చారు. 

5లక్షల క్యూబిక్‌ మీటర్లు మైనింగ్‌....
పోట్లదుర్తి బ్రదర్స్‌ నేతృత్వంలో చేపట్టిన క్రషింగ్‌ యూనిట్‌ ద్వారా 5.10లక్షల క్యూబిక్‌ మీటర్లు స్టోన్‌ క్రషర్‌ అక్రమంగా మైనింగ్‌ చేశారు. ఆమేరకు యర్రగుంట్ల మైనింగ్‌ ఏడీ వెంకటేశ్వర్లు నిర్ధారించారు. ఇందుకు రూ.21.67కోట్లు అపరాధ రుసుం చెల్లించాల్సిందిగా ఫిబ్రవరి 27న డిమాండ్‌ నోటీసు జారీ చేశారు. నోటీసుకు 90రోజుల లోపు జవాబు ఇవ్వాలి. కానీ 120 రోజులు గడుస్తున్నా పోట్లదుర్తి బ్రదర్స్‌ బినామీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆర్‌ఆర్‌ యాక్టు ప్రయోగించి జప్తు చేయాల్సిన యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. అటువైపు కన్నెత్తి చూసే సాహాసం చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. నాటి స్వామిభక్తిని నేటికీ అధికార యంత్రాంగం కొనసాగిస్తుండడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా నోటీసు మేరకు ఆర్‌ఆర్‌ యాక్టు ప్రయోగించాల్సిన ఆవసరముంది  కలెక్టర్‌ హరికిరణ్‌ జోక్యం చేసుకుంటే తప్పా పోట్లదుర్తి నాయుడు నుంచి ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం దక్కే అవకాశం లేదని జిల్లా వాసులు విశ్వసిస్తున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top