ఆచార్యునిగా కూలీ బిడ్డ! | A Porter Son As A Professor! | Sakshi
Sakshi News home page

ఆచార్యునిగా కూలీ బిడ్డ!

Mar 13 2019 11:45 AM | Updated on Mar 13 2019 11:48 AM

A Porter Son As A Professor! - Sakshi

తనికెళ్ల భరణి నుంచి సత్కారం పొందుతున్న ఇండ్ల చంద్రశేఖర్‌

సాక్షి, ఒంగోలు మెట్రో: మనో వికాసం కలిగించే గొప్ప మార్గం ‘నాటకం’ అంటున్నారు డాక్టర్‌ ఇండ్ల చంద్రశేఖర్‌. ఇప్పుడు  ప్రకాశం జిల్లా  రంగస్థల ప్రతిభ పుణే ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ దాకా చేరింది. అంతేకాదు. వందలాదిమంది కళాకారులను రంగస్థలం మీద మెరిపిస్తూనే, ‘థియేటర్‌’ను ఉపాధి జెండాగా కూడా ఎగరేస్తున్నారు. ప్రపంచ యవనిక మీద షేక్‌స్పియర్‌ నాటకాలు ఆడి, అట్నుంచటు హైద్రాబాద్‌ తెలుగు విశ్వవిద్యాలయంలో థియేటర్స్‌ ఆర్ట్స్‌ ప్రొఫెసర్‌గా ఎదిగిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలోని కందులూరు గ్రామానికి చెందిన ఇండ్ల చంద్రశేఖర్‌  గురించిన కథనం...

డాక్టర్‌ ఇండ్ల చంద్రశేఖర్‌ ’మట్టిమనుషుల జీవితంలోని అనేక కరుణాత్మక సంఘటనల గురించి గొప్ప కథలు రాశారు. అదే సమయంలో నాటకాలు రాసి అనేక చోట్ల ప్రదర్శించి జాతీయ స్థాయి ప్రతిభ చూపారు. ఔత్సాహిక నటులకు రంగస్థలంలో శిక్షణ ఇస్తున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ద్వారా ఫెలోషిప్‌ పొంది హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో థియేటర్‌లో స్నాతకోత్తర విద్యను పూర్తి చేసిన డాక్టర్‌ చంద్రశేఖర్‌ ప్రతిష్టాత్మక ఆగాఖాన్‌ అకాడెమీలో థియేటర్‌ విద్యార్థులకు ఐదేళ్లపాటు పాఠాలు చెప్పే ఆచార్యుడయ్యారు. వందలాదిమంది విద్యార్థులను థియేటర్‌లో రాణింపజేస్తున్న చంద్రశేఖర్‌ పలు పోటీల్లో తన నాటకాలు, దర్శకత్వం ద్వారా అవార్డులు పొందారు. కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చేసిన చంద్రశేఖర్‌ తర్వాత కాలంలో హెచ్‌సీయూ ఎంట్రన్స్‌ రాసి థియేటర్‌లో పీజీ చేశారు. ఈ క్రమంలో యూజీసీ ఉత్తీర్ణుడై ఇప్పుడు  విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నారు.


తల్లిదండ్రులు కూలీలు.. 
ఆయన తల్లిదండ్రులు రోజు కూలీలు. అక్కా చెల్లెళ్లు పచ్చాకు పనిచేస్తారు. తెలుగు కథా సాహిత్యంలో వెంటనే గుర్తొచ్చే పేరుగా ఉన్న చంద్రశేఖర్‌కు ప్రఖ్యాత రచయిత  కె.ఎన్‌వై.పతంజలి అంంటే చాలా ఇష్టం. ట్రాజిక్‌ కామెడీలో ఉండే ’ మిస్‌ మీనా‘ అనే నాటకం ఇప్పటికి 100కి పైగా పరిషత్‌లలో ప్రదర్శించి బహుమతులు స్వీకరించారు. థియేటర్‌ రంగం మీద అనేక పరిశోధనా పత్రాలతో అంతర్జాతీయ సదస్సుల్లో ఆయన రాణించాడు. అనేకచోట్ల కళాపరిషత్‌లలో ఆయన దర్శకత్వం వహించిన నాటకాలు కోసం అవార్డులు ఎదురుచూశాయి. 2017లో అమరావతి జాతీయ నాటకోత్సవాల్లో ఆయన దర్శకత్వంలోని నాటకాలు ప్రదర్శించి ప్రశంసలందుకున్నాయి. ’యాక్టింగ్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ, సృజనాత్మక ఆలోచనలతో విద్యార్థులను రంగస్థలం ఉన్నతంగా తీర్చిదిద్దుతుంద‘నే చంద్రశేఖర్‌ ఇప్పటికి పలు గొప్ప కథలతో కథానిక సాహిత్యంలో పేరు తెచ్చుకున్నారు.

పాండిచ్చేరి యూనివర్సిటీలో నాటకరంగం మీద పరిశోధన చేస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఎజిల్‌మతిని ప్రేమించి పెళ్లాడారు. తెలుగు నాటక,సినీ ప్రముఖులు అనేకమందికి చిరపరిచితమే కాక, అనేకమందిని సినీ రంగానికి కూడా పరిచయం చేసిన ఇండ్ల చంద్రశేఖర్‌ రాణించేలా చేస్తుందంటున్నారు. ప్రకాశం జిల్లా మాండలికాన్ని తన కథల్లో ప్రతిఫలిస్తూ, ప్రకాశం జిల్లా జీవితాన్ని తన రంగస్థల పాఠాల ద్వారా ఉద్దీపితం చేస్తూ ప్రపంచ నాటక రంగ అధ్యాపనంలో తన మేధోశక్తితో రాణిస్తున్న చంద్రశేఖర్‌ అనేకమంది విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. సంప్రదాయ కోర్సులతో నిరుద్యోగులుగా కుదేలయ్యే అనేకమంది మార్గాన్ని మార్చి జీవనోపాధులతో తీర్చిదిద్దుతున్నారు. కథకుడిగా, నాటక రచయిత, దర్శకుడిగా, ఆచార్యుడిగా రాణిస్తున్న చంద్రశేఖర్‌ అభినందనీయుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement