breaking news
litaracher awards
-
ఆచార్యునిగా కూలీ బిడ్డ!
సాక్షి, ఒంగోలు మెట్రో: మనో వికాసం కలిగించే గొప్ప మార్గం ‘నాటకం’ అంటున్నారు డాక్టర్ ఇండ్ల చంద్రశేఖర్. ఇప్పుడు ప్రకాశం జిల్లా రంగస్థల ప్రతిభ పుణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ దాకా చేరింది. అంతేకాదు. వందలాదిమంది కళాకారులను రంగస్థలం మీద మెరిపిస్తూనే, ‘థియేటర్’ను ఉపాధి జెండాగా కూడా ఎగరేస్తున్నారు. ప్రపంచ యవనిక మీద షేక్స్పియర్ నాటకాలు ఆడి, అట్నుంచటు హైద్రాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో థియేటర్స్ ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా ఎదిగిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలోని కందులూరు గ్రామానికి చెందిన ఇండ్ల చంద్రశేఖర్ గురించిన కథనం... డాక్టర్ ఇండ్ల చంద్రశేఖర్ ’మట్టిమనుషుల జీవితంలోని అనేక కరుణాత్మక సంఘటనల గురించి గొప్ప కథలు రాశారు. అదే సమయంలో నాటకాలు రాసి అనేక చోట్ల ప్రదర్శించి జాతీయ స్థాయి ప్రతిభ చూపారు. ఔత్సాహిక నటులకు రంగస్థలంలో శిక్షణ ఇస్తున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఫెలోషిప్ పొంది హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్లో స్నాతకోత్తర విద్యను పూర్తి చేసిన డాక్టర్ చంద్రశేఖర్ ప్రతిష్టాత్మక ఆగాఖాన్ అకాడెమీలో థియేటర్ విద్యార్థులకు ఐదేళ్లపాటు పాఠాలు చెప్పే ఆచార్యుడయ్యారు. వందలాదిమంది విద్యార్థులను థియేటర్లో రాణింపజేస్తున్న చంద్రశేఖర్ పలు పోటీల్లో తన నాటకాలు, దర్శకత్వం ద్వారా అవార్డులు పొందారు. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేసిన చంద్రశేఖర్ తర్వాత కాలంలో హెచ్‌సీయూ ఎంట్రన్స్ రాసి థియేటర్లో పీజీ చేశారు. ఈ క్రమంలో యూజీసీ ఉత్తీర్ణుడై ఇప్పుడు విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులు కూలీలు.. ఆయన తల్లిదండ్రులు రోజు కూలీలు. అక్కా చెల్లెళ్లు పచ్చాకు పనిచేస్తారు. తెలుగు కథా సాహిత్యంలో వెంటనే గుర్తొచ్చే పేరుగా ఉన్న చంద్రశేఖర్‌కు ప్రఖ్యాత రచయిత కె.ఎన్వై.పతంజలి అంంటే చాలా ఇష్టం. ట్రాజిక్ కామెడీలో ఉండే ’ మిస్ మీనా‘ అనే నాటకం ఇప్పటికి 100కి పైగా పరిషత్‌లలో ప్రదర్శించి బహుమతులు స్వీకరించారు. థియేటర్ రంగం మీద అనేక పరిశోధనా పత్రాలతో అంతర్జాతీయ సదస్సుల్లో ఆయన రాణించాడు. అనేకచోట్ల కళాపరిషత్‌లలో ఆయన దర్శకత్వం వహించిన నాటకాలు కోసం అవార్డులు ఎదురుచూశాయి. 2017లో అమరావతి జాతీయ నాటకోత్సవాల్లో ఆయన దర్శకత్వంలోని నాటకాలు ప్రదర్శించి ప్రశంసలందుకున్నాయి. ’యాక్టింగ్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ, సృజనాత్మక ఆలోచనలతో విద్యార్థులను రంగస్థలం ఉన్నతంగా తీర్చిదిద్దుతుంద‘నే చంద్రశేఖర్ ఇప్పటికి పలు గొప్ప కథలతో కథానిక సాహిత్యంలో పేరు తెచ్చుకున్నారు. పాండిచ్చేరి యూనివర్సిటీలో నాటకరంగం మీద పరిశోధన చేస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఎజిల్మతిని ప్రేమించి పెళ్లాడారు. తెలుగు నాటక,సినీ ప్రముఖులు అనేకమందికి చిరపరిచితమే కాక, అనేకమందిని సినీ రంగానికి కూడా పరిచయం చేసిన ఇండ్ల చంద్రశేఖర్ రాణించేలా చేస్తుందంటున్నారు. ప్రకాశం జిల్లా మాండలికాన్ని తన కథల్లో ప్రతిఫలిస్తూ, ప్రకాశం జిల్లా జీవితాన్ని తన రంగస్థల పాఠాల ద్వారా ఉద్దీపితం చేస్తూ ప్రపంచ నాటక రంగ అధ్యాపనంలో తన మేధోశక్తితో రాణిస్తున్న చంద్రశేఖర్ అనేకమంది విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. సంప్రదాయ కోర్సులతో నిరుద్యోగులుగా కుదేలయ్యే అనేకమంది మార్గాన్ని మార్చి జీవనోపాధులతో తీర్చిదిద్దుతున్నారు. కథకుడిగా, నాటక రచయిత, దర్శకుడిగా, ఆచార్యుడిగా రాణిస్తున్న చంద్రశేఖర్ అభినందనీయుడు. -
రారండోయ్
నిజం కవితా సంపుటి ‘నివురు’ ఆవిష్కరణ ఏప్రిల్ 18న ఉదయం 10:30కు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. వక్తలు: పి.అంజయ్య, కె.శివారెడ్డి, కె.శ్రీనివాస్, దేవిప్రియ, ఎన్.వేణుగోపాల్. కవిరాజ్ స్వర్ణోత్సవ(1968–2018) కవి సమ్మేళనం ఏప్రిల్ 21న సాయంత్రం 5 గంటలకు సాయి బృందావన్ ఫంక్షన్ హాలు, సూర్యాపేటలో జరగనుంది. ఇందులోనే కవిరాజ్ సాహితీ పురస్కారాన్ని జూలూరి గౌరీశంకర్‌కు ప్రదానం చేస్తారు. జి.జగదీశ్ రెడ్డి, వేణు ఊడుగుల అతిథులు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు శతకం ‘కోనసీమ శతకం’ ఆవిష్కరణ ఏప్రిల్ 21న సాయంత్రం 5:30కు అమలాపురంలోని ఎస్.కె.బి.ఆర్. కళాశాల ప్రాంగణంలో జరగనుంది. నిర్వహణ: త్రివేణి నృత్య గీత సాహిత్య కళావేదిక, అమలాపురం. శ్రీరామకవచం సాగర్ రచన ‘యాతన’ ఆవిష్కరణ ఏప్రిల్ 22న ఉదయం 10 గంటలకు విజయవాడ బందరు రోడ్‌లోని టాగూర్ స్మారక గ్రంథాలయంలో జరగనుంది. మల్లెతీగ కార్టూన్ల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం కూడా జరగనుంది. తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం)లో జరుగుతున్న ‘హైదరాబాద్ ఫెస్ట్’లో భాగంగా మఖ్దూం మొహియుద్దీన్ వేదిక మీద ‘సృజన స్వరం’ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21 వరకు ప్రతిరోజూ సాయంత్రం 5:30కు సాహిత్య సమావేశం, 7 గంటలకు కవి సమ్మేళనం జరగనున్నాయి. పోతులూరి వీరబ్రహ్మం జీవిత సాహిత్యాలపై రచనలను వెలువరిస్తున్నామనీ, మే 10లోపు వ్యాసాలు పంపమనీ కోరుతున్నారు ‘ప్రజాశక్తి’ జనరల్ మేనేజర్ కె.లక్ష్మయ్య. ఫోన్: 9490099057. ఒద్దిరాజు సోదరుల స్మృత్యంకంగా 1996 నుండి ఇస్తున్న ‘సహృదయ సాహితీ పురస్కారం’ కోసం 2017 సంవత్సరానికిగానూ 2013–17 మధ్య ముద్రించబడిన స్వీయ కథాసంపుటాలను ఆహ్వానిస్తున్నారు. కథకులు మూడు ప్రతులను 15 జూన్ లోగా కుందావజ్జల కృష్ణమూర్తి, ప్లాట్: 207, ఇం.నం. 2–7–580, సెంట్రల్ ఎక్సయిజ్ కాలనీ, హన్మకొండ– 506001 చిరునామాకు పంపవచ్చు. ఫోన్: 9849366652 -
‘రంగినేని’ సాహిత్య పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం
సిరిసిల్ల : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మకమైన ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం–2016’కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అవార్డు కమిటీ అధ్యక్షులు రంగినేని మోహన్‌రావు, కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. 2014, 2015, 2016 సంవత్సరాల్లో ప్రచురితమైన తెలుగు కథా సంపుటానికి అవార్డు అందిస్తామని పేర్కొన్నారు. అక్టోబరు 31లోగా ఐదు ప్రతులను ట్రస్ట్‌కు అందేవిధంగా పంపాలని కోరారు. అవార్డు కింద రూ.15వేల నగదు, జ్ఞాపిక, శాలువ, పురస్కార పత్రాన్ని 2017 జనవరిలో జరిగే అవార్డు ప్రదానోత్సవంలో అందిస్తామని వారు వెల్లడించారు. ఇతర వివరాలకు 94416 77373 సంప్రదించాలని సూచించారు.