పై ఫొటోలో వ్యక్తి పేరు శెట్టి శ్రీరామ్మూర్తి. ఊరు కోటనందూరు మండలం టీజే నగరం. సన్నకారు రైతు.
సొమ్ముల్లేక..
పై ఫొటోలో వ్యక్తి పేరు శెట్టి శ్రీరామ్మూర్తి. ఊరు కోటనందూరు మండలం టీజే నగరం. సన్నకారు రైతు. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండు నెలలుగా యూరిన్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్తోమత లేక ఎన్‌టీఆర్ వైద్యసేవలో నెల రోజుల క్రితం విశాఖపట్నం కేజీహెచ్‌కు రెండుసార్లు వెళ్లారు. శస్త్రచికిత్స చేయాలని చెప్పిన వైద్యులు అన్ని పరీక్షలూ చేశారు. చివరికి శస్త్రచికిత్స చేయకుండానే నామమాత్రంగా మందులిచ్చి పంపేశారు. దీంతో, సొంత సొమ్ములు వెచ్చించి, రెండు రోజుల క్రితం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు పది రోజుల తరువాత రావాలని చెప్పారు. చికిత్సకు అవసరమైన డబ్బులు లేకపోవడంతో ఆయన ఇంటికి వచ్చారు. ప్రస్తుతం యూరిన్ బ్యాగ్ వాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి భిన్నంగా ఎన్‌టీఆర్ ఆరోగ్య సేవ పథకం అమలవుతోందని, ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయించినా తక్షణం స్పందించే పరిస్థితి ఇప్పుడు లేదని ఆయన చెబుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :కటిక నిరుపేదకూ ఖరీదైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో 2007లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించారు. దీనిద్వారా ఎంతోమంది రోగులకు చక్కని వైద్యం అందింది. అయితే అదంతా గతం! టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పథకం పేరుతోపాటు అమలు విధానం కూడా మారిపోయింది. నాడు రోగమేదైనా సరే.. తెల్లకార్డుతో ధైర్యంగా ఆస్పత్రికి వెళ్లి వెనువెంటనే చికిత్స పొందేవారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో ‘ప్రియాత్’ పేరుతో జరుగుతున్న తతంగం రోజుల తరబడి సాగుతోంది. దీంతో అత్యవసర వైద్యం సకాలంలో అందక.. అందుతుందో లేదో తెలియక.. రోగులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. మరోవైపు వ్యాప్, ట్యాప్ అంటూ తెల్లరేషన్ కార్డులను విభజించడంతో ఎంతోమంది రోగులకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది.
ఆస్పత్రి మెట్లు ఎక్కగానే ఇక్కట్లు మొదలు..
ప్రియాత్.. రోగికి శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన అనుమతి కోసం సాగే ప్రక్రియ ఇది. రోగి ఆస్పత్రికి రాగానే ప్రాథమిక పరీక్ష నిర్వహించి, శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తిస్తే.. ఆ రోగికి సంబంధించిన తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యాధి వివరాలు ఆన్‌లైన్‌లో హెల్త్‌కేర్ ట్రస్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇది పూర్తయిన 24 గంటల్లోగా ట్రస్టులోని వైద్యులు ఆ వివరాలు పరిశీలించి శస్త్రచికిత్స చేసేందుకు అనుమతి ఇవ్వాలి.
ఈ ప్రియాత్ ప్రక్రియకు ఇప్పుడు 100 నుంచి 120 గంటల సమయం పడుతున్న సందర్భాలు అనేకం. దీంతో రోగికి శస్త్రచికిత్స ఆలస్యమైపోతోంది. ఫలితంగా రోగితోపాటు రోగి సహాయకులు వారం పది రోజులపాటు ప్రభుత్వాస్పత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి.
అదే ప్రైవేటు ఆస్పత్రిలో అయితే వెంటనే అయిపోతుందని అక్కడికి వెళ్లినవారికి మరోవిధమైన సమస్య ఎదురవుతోంది. ప్రియాత్ ఆలస్యమైనా లేదా ఆ రోగం వైద్యసేవ పరిధిలోకి రాదని నిర్ధారణ అయినా రోగి నుంచి అన్ని రోజులకూ భారీ మొత్తంలో ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.అంతకుముందే రకరకాల వైద్యపరీక్షల పేరుతో రోజుకు కొంత మొత్తం చొప్పున రోగి బంధువుల నుంచి లాగేస్తున్నారు. ఆ మొత్తం ప్రియాత్ అప్రూవల్ వస్తే వెనక్కి తీసుకోవచ్చని చెబుతూ ఆస్పత్రి వర్గాలు రోగి బంధువులను బోల్తా కొట్టిస్తున్నాయి.
సౌకర్యాలు అంతంతమాత్రమే..
నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీ పథకం అమలయ్యే నెట్‌వర్క్ ఆస్పత్రిలో కనీసం 10 పడకలతో ప్రత్యేక వార్డు ఉండాలి. కానీ ఏ ఒక్క ప్రైవేటు ఆస్పత్రిలోనూ ఈ తరహా ఏర్పాట్లు కనిపించడంలేదు. అలాగే రోగికి అన్ని వైద్య పరీక్షలు నెట్‌వర్క్ ఆస్పత్రిలోనే నిర్వహించాలి. కానీ వైద్యులు బయటి ల్యాబ్‌లకు సిఫారసు చేస్తున్నారు. దీనివల్ల వైద్యులకు కమీషన్ ప్రయోజనం మాటెలా ఉన్నా.. ల్యాబ్‌కు వెళ్లివచ్చేసరికి రోగి వ్యయప్రయాసలకు గురవుతున్నాడు. ప్రభుత్వాస్పత్రుల్లో ఎన్‌టీఆర్ ఆరోగ్య సేవ పథకం నిరుపేదలకు ఇప్పుడొక పరీక్షలా మారింది. సాధారణంగా అక్కడ అందరికీ ఉచిత వైద్యమే అందించాలి. కానీ ఆరోగ్య సేవ కార్డు తీసుకెళ్లిన రోగిని మాత్రం రోజుల తరబడి పక్కన పెడుతున్నారు. మహిళల గైనిక్ సమస్యలకు చేసే శస్త్రచికిత్సలకైతే రెండు మూడు నెలలు ఆస్పత్రి చుట్టూ తిిప్పిన సందర్భాలూ ఉన్నాయి.
రోగాల సంఖ్య పెరిగినా..
ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో 37 నెట్‌వర్క్ (ప్రైవేటు) ఆస్పత్రులు, ఆరు ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయి. వీటిల్లో 2007 నుంచి ఇప్పటివరకూ నెట్‌వర్‌క (ప్రైవేటు) ఆస్పత్రుల్లో 1,66,042 మందికి రూ.469.06 కోట్ల వ్యయంతో శస్త్రచికిత్సలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో 70,219 మందికి రూ.151.91 కోట్ల వ్యయంతో ఆపరేషన్లు చేశారు. గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 938 వ్యాధులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే వైద్యసేవలు అందించేవారు. ప్రస్తుతం వ్యాధుల సంఖ్యను 1098కి పెంచి ప్రభుత్వాసుపత్రుల్లోనే సగానికి పైగా వైద్యసేవలు అందేలా చేశారు. అయితే వ్యాధుల సంఖ్య పెంచినా పరిమితులు అనేకం పెట్టడంతో అనేక రకాల జబ్బులకు వైద్యం దొరకడంలేదు. తెల్లరేషన్ కార్డు ఉంటే ఈ పథకం వర్తిస్తుందనుకున్నవారికి నిరాశే ఎదురవుతోంది. శాశ్వత తెల్లరేషన్ కార్డుల(వ్యాప్)కు ఈ పథకం వర్తిస్తున్నా.. జన్మభూమి సమావేశాల్లో జారీ చేసిన తాత్కాలిక తెల్ల రేషన్ కార్డుల(ట్యాప్)కు వర్తించడంలేదు. ఎందుకంటే ఒకే నంబరుతో వేర్వేరు జిల్లాల్లో రెండు మూడు కార్డులు ఉండటంతో ఈ సమస్య తలెత్తుతోంది. ఫలితంగా జిల్లాలోని నాలుగో వంతు తెల్లకార్డుదారులకు ఎన్టీఆర్ వైద్యసేవ అందని ద్రాక్షే అవుతోంది.