జిల్లాలో రాజకీయ నాయకుల భవిష్యత్తును మహిళా ఓటర్లే నిర్ణయించ నున్నారు. వచ్చే ఎన్నికల్లో వారు వేసే ఓట్ల పైనే నాయకుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.
విజయనగరం కలెక్టరేట్,న్యూస్‌లైన్: జిల్లాలో రాజకీయ నాయకుల భవిష్యత్తును మహిళా ఓటర్లే నిర్ణయించ నున్నారు. వచ్చే ఎన్నికల్లో వారు వేసే ఓట్ల పైనే నాయకుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో 16,18,712మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పురుష ఓటర్లు 7,99,382 మంది కాగా మహిళా ఓటర్లు 8,19,225 మంది, ఇతరులు 105 మంది ఉన్నారు. గడిచిన 10 నెలల్లో జిల్లావ్యాప్తంగా కొత్తగా 44292మంది ఓటర్లుగా చేరారు. నియోజకవర్గాల వారీగా అధికారులు సోమవారం ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించారు. దీని ప్రకారం ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో సరి చూసుకోవచ్చు. డిసెంబర్ 10 వరకూ ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం జిల్లావ్యాప్తంగా జరుగుతుంది.1-1-2014 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కోసం ఫారం-6లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరక్షరాస్యులైన వారు తల్లిదండ్రులతో అఫిడవిట్ అందజేస్తే సరిపోతుంది. అలాగే మరణించిన, శాశ్వతంగా వలస పోయిన వారి పేర్లు తొలగించడానికి తగిన ఆధారాలతో ఫారం-7 అందజేయాలి. ఫారం-8లో పేరు మార్పు,చేర్పుల కోసం తప్పులు సవరించడానికి దరఖాస్తులు అందజేయాలి. ఫారం 8ఎ లో ఓటు ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పోలింగ్ స్టేషన్‌కు మార్చడానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈనెల 24,డిసెంబర్ 1,8వ తేదీల్లో వార్డులు,గ్రామాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటారు. ఆ సమయంలో నేరుగా పోలింగ్‌బూత్‌లోకి వెళ్లి దరఖాస్తులు అందజేయవచ్చు. తొలగింపుల కోసం 27,590 దరఖాస్తులు అందినట్ల అధికారులు చెబుతున్నారు.