రేషన్‌ బియ్యం...  తినే భాగ్యం...

Polished Rice Supplied To All Ration Holders From September First - Sakshi

పౌరసరఫరాల ద్వారా సన్న బియ్యం పంపిణీకి చర్యలు

వలంటీర్లద్వారా నేరుగా ఇంటికే సరఫరా

ఇకపై దుర్వినియోగం తగ్గే అవకాశం

రేషన్‌ బియ్యమా?... మాకొద్దు... అనేవారంతా ఇక వాటికోసం అర్రులు చాచనున్నారు. పురుగులు పట్టి... దుడ్డుగా ఉన్న బియ్యం ఇక తినాల్సిన అవసరం లేదు. అందరికీ నాణ్యమైన... సన్నబియ్యం తినే భాగ్యం కలగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామవలంటీర్ల ద్వారా లబ్ధిదారుని ఇంటికే నేరుగా ప్యాకెట్ల రూపంలో సరఫరా చేయాలని సంకల్పిస్తోంది. దీనివల్ల ఇప్పటివరకూ రేషన్‌ డిపోనుంచి తెచ్చి మారు వర్తకులకు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా... ఇచ్చిన బియ్యాన్ని సద్విని యోగం చేసుకునే అవకాశం కలగనుంది.

సాక్షి, విజయనగరం: ప్రతి పేదవాడూ ఇక సన్నబియ్యం తినే అవకాశం కలగనుంది. ప్రస్తుతం రేషన్‌డిపోల్లో ఇస్తున్న బియ్యం నాసిరకంగా ఉండటంతో గతిలేక లబ్ధిదారులు తినాల్సి వస్తోంది. కొందరైతే విడిపించిన బియ్యాన్ని మారువర్తకులకు అమ్ముకుని కాలక్షేపం చేస్తున్నారు. దీనివల్ల రేషన్‌ద్వారా సరఫరా చేస్తున్నా ఫలితం ఉండట్లేదు. పైగా ప్రజాపంపిణీ వ్యవస్థ అక్రమాలకు నిలయంగా మారింది. ఈ విషయాన్ని గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇకపై పేదలకు తినే బియ్యం ఇస్తే బాగుం టుందని భావించారు. సన్నబియ్యం సరఫరా చేసి వారికి ఉన్న ఇబ్బందులు తొలగించాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌ నెల నుంచి నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దుడ్డు బియ్యంతో ఇబ్బందులు
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు అనేక రకాలు సరకులు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. రెండు, మూడురకాల సరకులకే పరిమితమైంది. అవి కూడా నాణ్యమైనవి కాకపోవడం విశేషం. రేషన్‌డిపోల ద్వారా ఇంతవరకు దుడ్డు బియ్యం సరఫరా చేసేవారు. వాటిని తినలేక వారు వ్యాపారులకు అమ్ముకునేవారు. ప్రస్తుతం జిల్లాలో 7,13,053 రేషన్‌కార్డులున్నాయి. ఇందులో 30శాతం లబ్ధిదారులు అత్యంత పేదలు. వీరికి కోటా బియ్యం తప్ప వేరే గతి లేదు. బయట కొనుగోలు చేసే శక్తి లేక వాటినే బలవంతంగా తింటున్నారు. మిగతా వారికి కాస్త కొనుగోలు చేసుకునే శక్తి ఉండడంతో ఈ బియ్యం తినకుండా బయట సన్న బియ్యం కొంటున్నారు. విడిపించిన బియ్యం డీలరుకు గానీ, వీధుల్లోకి వచ్చే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. తద్వారా వచ్చిన డబ్బుకు కొంత కలిపి దుకాణాల్లో సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు.

జిల్లాలోని రేషన్‌ దుకాణాలు 1460
జిల్లాలో మొత్తం రేషన్‌కార్డులు 7,13,053
అన్నపూర్ణకార్డులు 846(లబ్ధిదారులు 1117)
అంత్యోదయ కార్డులు 84,972(లబ్ధిదారులు 2,34,076)
తెల్ల రేషన్‌ కార్డులు 6,27,235(లబ్ధిదారులు 18,25,778)
మొత్తం నెలకు సరఫరా చేస్తున్న బియ్యం 1,20,784 క్వింటాళ్లు

సన్నబియ్యంతో మంచి రోజులు
ప్రజాసంకల్ప పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఈ అంశం రావడంతో అధికారంలోకి రాగానే పేదలకు సన్నబియ్యం సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా ప్రజాపంపిణీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేదిశగా అడుగులేస్తున్నారు. సెప్టెంబర్‌ నెల నుంచి ఇంటింటికి సరుకులు సరఫరా చేయాలని నిర్ణయించారు. అదే నెల నుంచి నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేయాలని భావిస్తున్నారు. 5, 10, 15 కిలోల ప్యాకెట్ల రూపంలో అందించాలని భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

కసరత్తు చేస్తున్న అధికారులు
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు కూడా ప్రారంభించేశారు. కార్డుదారులు వారీగా అవసరమైన బియ్యం లెక్క తేలుస్తున్నారు. సరకులు ఏవిధంగా సరఫరా చేయాలన్న అంశంపై కూడా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సన్నబియ్యం, కావాల్సిన మొత్తం బియ్యం తదితర వివరాలు తయారు చేస్తున్నారు. వీటన్నింటిని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టిన తర్వాత చాలకుంటే ఇతర ప్రాంతాల నుంచి సేకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనిపై 24వ తేదీన ఉండవల్లిలో జరిగే కలెక్టర్లు సదస్సులో చర్చించిన తర్వాత పూర్తి విధివిధానాలు ఖరారవుతాయని సమాచారం.

గతంలో రైతు బజార్లలో...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలనలో రైతు బజార్లలో తెల్ల రేషన్‌ కార్డు లబ్ధిదారులకు సూపర్‌ ఫైన్‌ బియ్యం విక్రయించేవారు. అప్పట్లో ఆ కార్యక్రమం విజయవంతం అయింది. క్రమేపీ రేషన్‌ షాపులకూ విస్తరిస్తామనుకున్న సమయంలో ఆయన స్వర్గస్తులయ్యారు. అప్పటితో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఆయన తనయుడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సన్నబియ్యాన్ని అన్ని జిల్లాల్లోని రేషన్‌ షాపులకూ సరఫరా చేయాలని నిర్ణయించడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు సంతోషం ప్రకటిస్తున్నారు.

కలెక్టర్‌ల సదస్సులో నిర్ణయం తీసుకుంటారు
సన్నబియ్యం సరఫరాపై సోమవారం జరిగే జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో నిర్ణయం తీసుకుంటారు. ఆ తరువాత ప్రభుత్వం విధి విధానాలను ప్రకటిస్తుంది. అప్పుడు జిల్లాల వారీగా ప్రతిపాదనలు, సరఫరాలపై నిర్ణయం తీసుకుంటాం. 
– ఎన్‌ సుబ్బరాజు, డీఎస్‌ఓ, విజయనగరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top