పోలీసు ఉచ్చులో అంతర్జాతీయ స్మగ్లర్లు | police, while the International Smugglers | Sakshi
Sakshi News home page

పోలీసు ఉచ్చులో అంతర్జాతీయ స్మగ్లర్లు

Jul 3 2014 3:13 AM | Updated on Sep 2 2017 9:42 AM

‘ఎర్ర’ దొంగలను అరెస్టు చేయడంలో పోలీసులు చురుగ్గా కదులుతున్నారు. ఇన్నాళ్లూ రాష్ట్రీయ దొంగల వేటను సాగించిన చిత్తూరు, వైఎస్సార్ జిల్లా పోలీసులు తొలిసారి ఏడుగురు అంతర్జాతీయ దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

  •     అదుపులో ముంబయి,కోల్‌కతా, ఢిల్లీకి చెందిన ముగ్గురు
  •      తమిళనాడు, కర్ణాటకకు చెందిన మరో నలుగురు కూడా
  •      ఇప్పటివరకూ అరెస్టయిన వారి సంఖ్య వందకుపైనే
  •      పీడీ యాక్టు నమోదైన వారిసంఖ్య 14
  •      మరో 9 మందిపై ‘పీడి’కిలి
  • సాక్షి, చిత్తూరు: ‘ఎర్ర’ దొంగలను అరెస్టు చేయడంలో పోలీసులు చురుగ్గా కదులుతున్నారు. ఇన్నాళ్లూ రాష్ట్రీయ దొంగల వేటను సాగించిన చిత్తూరు, వైఎస్సార్ జిల్లా పోలీసులు తొలిసారి ఏడుగురు అంతర్జాతీయ దొంగలను అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతాకు చెందిన ముగ్గురు అంతర్జాతీయ ఎర్రచందనం దొంగలను రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరితోపాటు తమిళనాడుకు చెందిన ముగ్గురు, కర్ణాటకకు చెందిన మరో స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. చిత్తూరు, వైఎస్సార్ జిల్లా, తిరుపతి, నెల్లూరు పోలీసులు జాయింట్ ఆపరేషన్ కు వీరు చిక్కినట్లు తెలిసింది.
     
    చిత్తూరు ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ ?
     
    వారం రోజుల కిందట తమిళనాడుకు చెందిన శరవణ, శంకర్, జయరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిని విచారిస్తే కోల్‌కతా, న్యూఢిల్లీ, ముంబైకి చెందిన దొంగలు పట్టుబడ్డట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. వీరంతా ఎర్రచందనం దుంగలను విదేశాలకు విక్రయించి తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల్లోని ఎర్రచందనం స్మగ్లర్లకు డాన్‌లుగా చెలామణి అయినట్లు తెలిసింది. వీరిలో ముంబైకి చెందిన ఓ స్మగ్లర్ రోజుకు రూ.2లక్షల వరకూ వ్యక్తిగత ఖర్చులకు వినియోగిస్తారని సమాచారం. దీన్నిబట్టే అతను ఏ స్థాయిలో స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడో తెలుస్తోంది.
     
    రియాజ్ అరెస్టుతో చిక్కిన చిత్తూరు దొంగ
     
    పై ఆరుగురితోపాటు కర్ణాటకలోని కోలార్‌కు చెందిన రియాజ్ అనే స్మగ్లర్‌ను ఉబ్బనహళ్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రియాజ్ గతంలో వీరప్పన్‌కు అనుచరుడిగా ఉండి అటవీ సంపదను విదేశాలకు తరలించడంలో సహకరించేవాడని తెలిసింది. అతన్ని ఆంధ్రకు తీసుకొస్తుండగా చిత్తూరుకు చెందిన ఓ ఎర్రచందనం స్మగ్లర్ పదేపదే రియాజ్‌కు ఫోన్‌చేసి ‘భాయ్...సరుకు ఉంది. కొంటావా?’ అని అడిగినట్లు తెలిసింది.

    తీరా రియాజ్ పోలీసు ఉన్నతాధికారి వద్దకు వచ్చినప్పుడు కూడా ఈ ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీంతో అతన్ని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరి ఏడుగురితోపాటు ఇటీవల చెన్నైలో దొరికిన ఇద్దరు స్మగ్లర్లపై పోలీసులు ‘పీడీ యాక్టు’ నమోదుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టులు 95కు చేరినట్లు తెలిసింది. తక్కిన 105  మంది కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement