పోలీస్‌ వర్సెస్‌ సర్పంచ్‌

police vs sarpanch - Sakshi

కిడ్నాపర్ల కోసం వేటలో భాగంగా సర్పంచ్‌ ఇంట్లో సోదాలు

ప్రతిఘటించిన కుటుంబీకులు  

డీఎస్పీ జోక్యంతో సద్దుమణిగిన వివాదం

డోన్‌ టౌన్‌: అనంతపురం టూటౌన్‌ పోలీసులకు, డోన్‌ మండలం ఉంగరానిగుండ్ల గ్రామ సర్పంచ్‌ రాముడు కుటుంబ సభ్యులకు మధ్య బుధవారం ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని చిన్నపిల్లల కిడ్నాప్‌ కేసు విచారణ నిమిత్తం టౌటౌన్‌ ఎస్‌ఐలు శ్రీరామ్, క్రాంతికుమార్‌ బుధవారం డోన్‌కు వచ్చి చిగురుమాను పేట, వైఎస్సార్‌నగర్‌లోని అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పొరపాటున సర్పంచ్‌ రాముడు ఇంట్లోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ప్రతిఘటించారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తమపై దాడికి దిగారని డోన్‌ స్టేషన్లో సర్పంచ్‌ రాముడిపై ఫిర్యాదు చేశారు. వారి వాహనంలో నుంచి రాముడిని దించి స్థానిక పోలీసులకు అప్పజెప్పేందుకు ప్రయత్నించగా.. అక్కడా ఇరువర్గాల మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. సీఐ రాజగోపాల్‌ నాయుడు, ఎస్‌ఐ శ్రీనివాసులు ఇరువర్గాలకు సర్దిచెప్పేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఎస్పీ గోపీనాథ్‌జట్టి ఆదేశాల మేరకు అక్కడకు చేరుకొన్న డీఎస్పీ బాబాఫకృద్దీన్‌ పరిస్థితిని చక్కదిద్దారు. 

కిడ్నాప్‌ ముఠాను తప్పించారు
పసి పిల్లలను కిడ్నాప్‌చేసి తల్లిదండ్రులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్న ఎరుకల పిలకల రవి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకునే క్రమంలో సర్పంచ్‌ రాముడు, అతని కుమారులు అడ్డుపడి తప్పించారని ఎస్‌ఐ శ్రీరామ్‌ అన్నారు. ఇంకా ఇద్దరు చిన్నారులు కిడ్నాప్‌ ముఠా అధీనంలోనే ఉన్నారన్నారు. కాగా.. తమకు కిడ్నాప్‌ ముఠాతో ఎలాంటి సంబంధం లేదని, తమ ఇంట్లోకి ప్రవేశించి సోదాలు చేయడంతో పాటు తనపై, తన కుమారులపై చేయి చేసుకున్నారని సర్పంచ్‌ రాముడు ఆరోపించారు. చిన్నపొరపాటు మూలంగానే ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని, ఇరువర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రానందున కేసులు నమోదు చేయలేదని డీఎస్పీ చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top