వంశీతేజ మృతికి కారణాలేంటి!?

Police still have no clue about death of engineering student vamsiteja - Sakshi

సాక్షి, విజయవాడ : ఇంజినీరింగ్‌ విద్యార్థి వంశీతేజ మృతి కేసు విచారణ ముందుకు సాగక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల రెండో తేదీన కళాశాలలో పరీక్ష రాసి కనిపించకుండా వెళ్లిన సత్యనారాయణపురం శ్రీనగర్‌ కాలనికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి గుర్రం వంశీతేజ శవమై కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికందిన తమ ఒక్కగానొక్క కుమారుడు ఈ రోజు కాకపోయినా రేపయినా తమ వద్దకు వస్తాడని కోటిఆశలతో ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు వంశీతేజ మృత్యువాత తీరని శోకం మిగిల్చింది.

అయితే అసలు వంశీతేజ మరణానికి కారణాలేంటి? కళాశాలకు వెళ్లి పరీక్ష కూడా రాసిన అతను ఆ తరువాత ఎక్కడికి వెళ్లాడు? వైజాగ్‌ వెళ్లే బస్సు ఎక్కుతున్నట్లు సీసీ కెమెరాల్లో కనిపించిన వంశీ తేజ తిరిగి చీరాల సముద్రం ఒడ్డున ఎలా మృతిచెందాడు? అన్న ప్రశ్నలను ఛేదిం చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాల్‌ రికార్డ్స్‌ ఆధారంగా..
పోలీసులకు దొరికిన వంశీతేజ సిమ్‌కార్డు ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నెల 2వ తేదీ నుంచి కనిపించకుండా వెళ్లిన అతను ఎవరెవరికి ఫోన్లు చేశాడు? ఎవరెవరిని కలిశాడు? అనే వివరాలను రాబడుతున్నారు. ప్రధానంగా క్రికెట్‌ బెట్టింగ్‌లో చేసిన అప్పుల వల్లే వంశీతేజ మృతిచెంది ఉంటాడని ముందుగా అందరూ భావించారు. కాల్‌ రికార్డులను పరిశీలిస్తున్న పోలీసులకు అతని మరణానికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

క్రికెట్‌ బుకీకి రూ.20 వేల వరకూ ఇవ్వాల్సి ఉందని వార్తలు వినిపిస్తున్నా అంత చిన్న అప్పుకే వంశీతేజ ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని అతని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. ఈ రూ.20 వేలతో పాటు ఇంకా వేరే అప్పులేమైనా ఉన్నా యా? లేక కళాశాలలో చదవలేక ఈ నిర్ణయం తీసుకున్నాడా? మరేమైన ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా ఇప్పటికే నగరంలోని పలువురు క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులను కూడా పిలిపించి పోలీసులు విచారణ చేస్తున్నారని సమాచారం.

అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం
వంశీ తేజ కేసులో అన్ని కోణాలలో విచారణ చేపట్టాం. అతని కాల్‌ రికార్డ్స్‌ ఆధారంగా కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నాం. అతని మరణానికి అసలు కారణాలు ఏమిటనేవి ఇంకా తెలియడం లేదు. పూర్తి విచారణ తరువాత త్వరలోనే వివరాలను వెల్లడిస్తాం. – సత్యనారాయణ, సీఐ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top