పోలీసుల వేధింపులతో కార్మికుడి ఆత్మహత్య | Police persecution worker suicide | Sakshi
Sakshi News home page

పోలీసుల వేధింపులతో కార్మికుడి ఆత్మహత్య

Published Sat, Aug 2 2014 12:32 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

పోలీసుల వేధింపులతో కార్మికుడి ఆత్మహత్య - Sakshi

మంగళగిరి రూరల్: పోలీసులు తనను దొంగగా చిత్రీకరించి అవమానించడాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం సాయంత్రం సంచలనాన్ని కలిగించింది. వివరాలిలా ఉన్నాయి... విజయవాడ కృష్ణలంకకు చెందిన నడకుదిటి శంకరరావు(40) ఆటోనగర్‌లో ఫౌండ్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
 
 గత నెల 29 (మంగళవారం)న తన స్నేహితుడు ఎల్.వెంకటేశ్వరరావు దగ్గర ద్విచక్ర వాహనాన్ని తీసుకుని వ్యాపారం నిమిత్తం గుంటూరు నగరానికి వెళ్లాడు. వ్యాపార పనులు ముగించుకుని రాత్రి వేళ కావడంతో ఓ మద్యం దుకాణం వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు.  ఇంతలో అక్కడికి లాలాపేట పోలీసులు చేరుకుని శంకరరావును ద్విచక్ర వాహనాలు కాగితాలు చూపించాలని కోరారు. ఇది తన స్నేహితుడి బండి అని, కాగితాలు తెప్పిస్తానని చెప్పాడు.
 
 అయినా వినిపించుకోని పోలీసులు శంకరరావును, ద్విచక్ర వాహనాన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో శంకరరావు స్నేహితుడు వెంకటేశ్వరరావు ద్విచక్ర వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తీసుకువెళ్లి పోలీసులకు చూపించాడు. ద్విచక్ర వాహనాన్ని ఇచ్చేందుకు పోలీసులు రూ.5వేలు అడిగారు. అంత డబ్బు ఇచ్చుకోలేనని, ఇప్పుడు తనవద్ద లేవని శంకరరావు విన్నవించుకున్నాడు. పక్కనే వున్న స్నేహితుడు వెంకటేశ్వరరావు తన వద్ద వున్న రూ. 3,500 పోలీసులకు ఇచ్చినా శంకరరావును విడిచి పెట్టకపోగా ద్విచక్ర వాహనాన్ని కూడా ఇవ్వలేదు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో శంకరరావు స్నేహితుడు వెంకటేశ్వరరావు చేసేది లేక తిరిగి విజయవాడకు వచ్చాడు. బుధవారం ఉదయం శంకరరావు బావగారైన రామ్మోహనరావుతో కలసి మళ్లీ లాలాపేట స్టేషన్‌కు వెళ్లి పోలీసులను బతిమిలాడారు. కనికరించని పోలీసులు  కేసు నమోదు చేసి ఆగస్టు ఆరో తేదీ కోర్టుకు హాజరుకావాలని చెప్పి వదిలిపెట్టారు. దీంతో మనస్థాపం చెందిన శంకరరావు మండలంలోని యర్రబాలెం బసవతారకనగర్‌లోని తన స్నేహితురాలి ఇంటికి బుధవారం రాత్రి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
 అస్వస్థతతో ఉన్న ఆయన్ను స్థానికులు చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శంకరరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య గుణవాణి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు విజయవాడ ఆస్పత్రికి చేరుకుని మృతుని జేబులోని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 లాలాపేట పోలీసులపై కేసు నమోదు
  లాలాపేట పోలీసులపై కేసు నమోదు చేసినట్లు మంగళగిరి రూరల్ ఎస్‌ఐ అంకమ్మరావు శుక్రవారం రాత్రి  తెలిపారు. లాలాపేట సీఐ వినయ్‌కుమార్, ఎస్‌ఐ కె.వీరాస్వామి, ఏఎస్‌ఐ డి.నాయక్, కానిస్టేబుల్ మజారుల్లాలపై శంకరరావు భార్య గుణవాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement