వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై పోలీస్‌ జులుం

Police over action on YSRCP MLA - Sakshi

     పేదల సమస్యలను చూడాలని మంత్రి నారాయణకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వినతి

     ఎమ్మెల్యేను పక్కకు లాగేసి, ఈడ్చుకెళ్లిన పోలీసులు 

సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాల్టీలో మంత్రి పి.నారాయణ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాలనీ సమస్యలను పరిశీలించాలని మంత్రిని కోరడానికి వచ్చిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై దౌర్జన్యం చేశారు. అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్న పోలీసుల తీరుపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ‘హౌస్‌ ఫర్‌ ఆల్‌’ గృహాలను లబ్ధిదారులకు కేటాయించేందుకు మంత్రి నారాయణ శనివారం సూళ్లూరుపేట మున్సిపాల్టీ పరిధిలోని మన్నారుపోలూరుకు వచ్చారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నాయుడుపేటకు బయలుదేరారు. ఇదే సమయంలో వట్రపాళెం వద్ద స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మంత్రి కాన్వాయ్‌ను ఆపి, మర్యాదపూర్వకంగా మంత్రికి శాలువా కప్పారు. జాతీయ రహదారికి పక్కనే ఉన్న వట్రపాళెంలో కనీస వసతులకు దూరంగా బతుకుతున్న నిరుపేదల బాధలను చూడాలని మంత్రిని కోరారు. అది పెద్ద నేరమైనట్లు గూడూరు డీఎస్పీ వీఎస్‌ రాంబాబు, స్థానిక పోలీస్‌ అధికారులు రెచ్చిపోయారు. డీఎస్పీ రాంబాబు ఎమ్మెల్యే కిలివేటిని పక్కకు నెట్టేశారు. అక్కడే ఉన్న పలువురు సీఐలు, ఎస్సైలు కూడా కల్పించుకుని ఎమ్మెల్యేను ఈడ్చుకెళ్లారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కిలివేటితోపాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అందోళనకు దిగారు. పోలీస్‌ జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి నారాయణ స్పందిస్తూ.. ‘‘నేను రాను, నాకు వేరే షెడ్యూల్‌ ఉంది. నాయుడుపేటకు వెళ్లాలి, ఈ రోజు షెడ్యూల్‌లో వట్రపాళెం లేదు. ఊరికే విసిగించకు’’ అంటూ రుసరుసలాడారు.  

నాయుడుపేటలో గందరగోళం 
నాయుడుపేటలో ‘హౌస్‌ ఫర్‌ ఆల్‌’ ఇళ్లు కేటాయింపు సభలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. పేదలకు మేలు చేసింది వైఎస్‌ రాజశేఖరరెడ్డేనని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. మంత్రి నారాయణ తీరును ఆయన తప్పుపట్టారు. జై వైఎస్సార్‌ అంటూ ప్రసంగాన్ని ముగించబోయారు. అదే సమయంలో సభలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా జై వైఎస్సార్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో ‘నుడా’ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యే సంజీవయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు కూడా పోటీగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి  కార్యకర్తలను అడ్డుకుని, బయటకు పంపేందుకు యత్నించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేసి సభ నుంచి బయటకు వచ్చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top