పోలవరం ప్రాజెక్టు పనుల్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(జలవనరుల విభాగం) శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న చైర్మన్, సభ్యులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(జలవనరుల విభాగం) శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. హుకుంసింగ్ నేతృత్వంలో 31 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ విజయవాడ నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు పోలవరానికి బయల్దేరనుంది. పోలవరం హెడ్ వర్క్స్(స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహిస్తుంది.
తర్వాత తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఎడమ కాలువ.. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో కుడి కాలువ పనుల్ని పరిశీలించి రాత్రికి విజయవాడకు చేరుకుంటుంది. శనివారం ఉదయం పది గంటలకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టులతోపాటు పోలవరం ప్రాజెక్టు పనులపై జలవనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తుంది. అనంతరం మధ్యాహ్నం 12.55 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి బయల్దేరి వెళ్తుంది.
అక్కడ తోటపల్లి ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తుంది. రాష్ట్ర పరిధిలో వ్యాప్కోస్(వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్) కార్యకలాపాల్ని సమీక్షించి.. శనివారం రాత్రికి విశాఖపట్నంలోనే బస చేస్తుంది. ఆదివారం ఉదయం 7.50 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తుంది. కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు మాగంటి మురళీమోహన్, ఎస్పీవై రెడ్డి, తెలంగాణ నుంచి బి.వినోద్‌కుమార్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.