కొండల్ని కొల్లగొడుతున్నారు!

Plundering The Hills In Chodavaram - Sakshi

అడుగడుగునా మెటల్‌ అక్రమ క్వారీలు

యథేచ్ఛగా తవ్వకాలు

టీడీపీ నేతల అండదండలతో తరలింపు

మామూళ్లకు ఆశపడి పట్టించుకోని అధికారులు

సాక్షి, చోడవరం : మండలంలో అక్రమ మెటల్‌ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఎవరికి తోచిన స్థాయిలో వారు కొండలను తవ్వేస్తున్నారు. అడ్డుకున్నవారికి మామూళ్లు ఇస్తూ..గోవాడ, అడ్డూరు, గంధవరం, బెన్నవోలు, ఖండిపల్లి, దుడ్డుపాలెం, అంభేరుపురం గ్రామాల పరిధిలోని కొండల్లో అక్రమ మెటల్‌ క్వారీలు నిర్వహిస్తున్నారు. అడ్డుకున్నవారికి మామూళ్లు ఇస్తూ దోచుకున్నవారికి దోచుకున్నంతగా ఈ కొండలను కొల్లగొడుతున్నారు. వాస్తవానికి ఎర్ర మెటల్‌ తవ్వకాలు, రవాణా చేయాలంటే  ముందుగా రెవెన్యూ, గనులశాఖల అనుమతి తప్పనిసరి. కాని చోడవరం మండలంలో మాత్రం అవేమీ లేవు. 

స్థానిక టీడీపీ నేతల కనుసన్నల్లో..
స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఎవరికి తోచినంత వారు తవ్వేసుకొని తరలించుకుపోతున్నారు. గోవాడ–భోగాపురం గ్రామ మధ్య ఉన్న కొండపై అడుగడుగునా ఈ అక్రమ మెటల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. ఖండిపల్లి, భోగాపురం, దుడ్డుపాలెం, అడ్డూరు క్వారీల్లో పొక్లెయిన్, జేసీబీ యంత్రాల సాయంతో ఎక్కడికక్కడ కొండను తవ్వేసి లారీలు, ట్రాక్టర్లపై తరలించుకుపోతున్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి.  వీటికి స్థానిక అధికారపార్టీ నాయకుల సహకారం కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

అధికార పార్టీ సర్పంచ్‌ల అనుచరులే..
ఖండిపల్లి, దుడ్డపాలెం గ్రామాల్లో అధికారపార్టీ సర్పంచ్‌ల అనుచరులే నేరుగా కొండను తవ్వేసి మెటల్‌ను అమ్మేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. గంధవరం, అడ్డూరు గ్రామాల్లో రియల్టర్లు పక్కనే ఉన్న కొండల నుంచి ఎర్ర మెటల్, మట్టిని తవ్వేసి భూములను ఎత్తుచేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు.

వీఆర్వోలపై విమర్శలు..
స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సహకారంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన మండల రెవెన్యూ అధికారులు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడంతో అక్రమ క్వారీలు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.  దీనిపై మైనింగ్‌ శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అనుమతి లేకుండా కొండలను తవ్వేయడం వల్ల  ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా పర్యావరణాన్ని పరిరక్షించే కొండలు, పచ్చదనం కూడా నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిపై మైన్స్, రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం
గ్రావెల్‌ క్వారీలకు మండలంలో ఎటువంటి అనుమతులు లేవు. అక్రమంగా తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకుంటాం. తవ్వకాల నిరోధించేందుకు ఆయా గ్రామాల వీఆర్వోలతో తనిఖీ బృందం ఏర్పాటుచేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.
– కేవీఎస్‌ రవి, తహసీల్దార్, చోడవరం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top