శ్రీవారి అపురూపమైన ఫొటోలను పంపించండి

Please Send Srivari rare pictures, appeals TTD - Sakshi

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

సాక్షి, తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని, పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలిపే అపురూపమైన పాత చిత్రాలు ఉంటే ఈనెల 7వ తేదీలోగా తమకు పంపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఏటా తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద ‘నాడు–నేడు’ పేరిట ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం, తిరుపతిలోని ఆలయాలు, ఇతర టీటీడీ అనుబంధ ఆలయాలకు సంబంధించిన అపురూపమైన పాత ఫొటోలను ‘ప్రజాసంబంధాల అధికారి (పీఆర్‌ఓ), టీటీడీ పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి –517520’ చిరునామాకు పంపించాలని టీటీడీ కోరింది.

మరిన్ని వివరాలకు 0877–2264217 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది. కాగా, ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 10 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఫొటోల ప్రదర్శన నిర్వహించనుంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలో నిత్య పూజల సందర్భంగా వినియోగించే పాత్రలు, పూజా ద్రవ్యాలు, ప్రత్యేక పర్వదినాలు, ఇతర ఉత్సవాల దినాల్లో పూజలు అందుకునే ఉత్సవమూర్తుల ఫొటోలతో విడివిడిగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు. 80 ఏళ్లనాటి శ్రీవారి ఆలయ చరిత్రను కళ్లకు కట్టే అరుదైన ఫొటోలను కూడా ప్రదర్శనలో ఉంచుతారు. 1950వ సంవత్సరానికి ముందు, ఆ తరువాత శ్రీవారి సేవలో పాల్గొన్న రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, స్వామీజీలు, ఇతర ప్రముఖుల ఫొటోలను కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేయనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top