‘హద్దు’ దాటి.. అక్రమ రవాణా

Petrol And Diesel Are Being Smuggled From Yanam - Sakshi

యానాం నుంచి మన జిల్లాకు యథేచ్ఛగా పెట్రోల్, డీజిల్‌ తరలింపు

బరితెగిస్తున్న ఆయిల్‌ వ్యాపారులు

 సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద మొక్కుబడిగా తనిఖీలు

మామూళ్ల మత్తులో జిల్లా పోలీసులు

జిల్లా ఆదాయానికి భారీగా గండి

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: యానాంలోని బంకులకు గోకవరం గుమ్మళ్లదొడ్డిలోని స్టోరేజీ ట్యాంకుల నుంచి ట్యాంకర్ల ద్వారా పెట్రోల్, డీజిల్‌ సరఫరా అవుతోంది. ఒక్కో బంకు ప్రతి నెలా 2 లక్షల లీటర్ల డీజిల్, లక్ష లీటర్ల పెట్రోలు దిగుమతి చేసుకుంటున్నాయి. దీని ప్రకారం అక్కడున్న మొత్తం 11 బంకుల ద్వారా ప్రతి నెలా సుమారు 22 లక్షల లీటర్ల డీజిల్, 11 లక్షల లీటర్ల పెట్రోలు అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రపాలిత ప్రాంతాల్లో విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) తక్కువగా ఉంటుంది. దీంతో పొరుగునే ఉన్న మన రాష్ట్రంతో పోలిస్తే యానాంలో పెట్రో ధరలు తక్కువ. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ వ్యాపారులు అక్కడి పెట్రోల్‌ బంకుల నుంచి పెట్రోలు, డీజిల్‌ను అక్రమ మార్గాల్లో మన జిల్లాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

కిళ్లీ కొట్లు, రోడ్డు మార్జిన్లలో.. 
ఇటీవలి వరకూ యానాంలో పెట్రోలు, డీజి ల్‌ ధరలు మన జిల్లా కంటే లీటరుకు ఏడెనిమిది రూపాయలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం యానాంలో లీటర్‌ డీజిల్‌ రూ.76, పెట్రోలు రూ.80.34గా ఉంది. అదే యానాంకు ఆనుకుని మన జిల్లాలో ఉన్న తాళ్లరేవులో డీజిల్‌ ధర రూ.78.79, పెట్రోలు రూ.83.63గా ఉంది. కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను దాదాపు ప్రతి రోజూ పెంచుతోంది. ఈ నేపథ్యంలో యానాంలో కూడా పెట్రో ధరలు పెరిగాయి. అయినప్పటికీ మనకంటే రేటు తక్కువగానే ఉండడంతో.. పలువురు వ్యాపారులు అక్క డి బంకుల్లో కొనుగోలు చేసిన పెట్రోలు, డీజిల్‌ను కొంత లాభం వేసుకుని మన జిల్లా లోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్నారు. ముఖ్యంగా కోనసీమలోని మురమళ్ల, ముమ్మిడివరం, మహిపాల చెరువు, అనాతవరం, క్రాప, భట్నవిల్లి, రామచంద్రపురం, మండపేట, కాకినాడ తదితర ప్రాంతాలకు వీటిని అక్రమంగా తరలించి అమ్ముతున్నారు.

సోడా, కిళ్లీ దుకాణాల వద్ద, రోడ్డు మార్జిన్లలోను బహిరంగంగానే అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రతి రోజూ తెల్లవారుజామున అటు కోనసీమ, ఇటు కాకినాడ, మరోపక్క రామచంద్రపురం ప్రాంతాల నుంచి మోటార్‌ సైకిళ్లపై వచ్చిన రిటైలర్లు పెద్దపెద్ద ప్లాస్టిక్‌ టిన్నులతో బారులు తీరి యానాంలో దర్శనమిస్తారు. ఒక్కో మోటార్‌ బైక్‌పై కనీసం 200 లీటర్ల పెట్రోలు తరలిస్తున్నారు. తీరప్రాంతాల్లో ఆక్వా చెరువుల్లో ఉపయోగిస్తున్న ఇంజన్ల కోసం కూడా భారీగా డీజిల్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఖాకీలకు కాసులు 
యానాం నుంచి జిల్లాకు పెట్రో ఉత్పత్తుల అక్రమ రవాణాను కట్టడి చేయడంలో జిల్లా పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది పోలీసులు దీనిని కాసులు సంపాదించుకోవడానికి అవకాశంగా కూడా తీసుకుంటున్నారు. చెక్‌పోస్టుల్లో అందిన కాడికి జేబులో వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ అక్రమ రవాణా తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పోలీసులకు కాసులు కురిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెట్రోలుతో వెళ్తున్న ఒక్కో వాహనదారు వద్ద రూ.200 నుంచి రూ.500 వరకూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. యానాం బైపాస్, నీలపల్లి వంతెన, అరటికాయలంక, బాపనపల్లి సెంటర్, కాపులపాలెం, ఎదుర్లంక, అరటికాయలంక తదితర ప్రాంతాల్లో పోలీసులు ముడుపులు మెక్కి చమురు అక్రమ రవాణాదార్లను వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. 

80 శాతం అక్రమంగా తరలింపు! 
పెట్రోలు బంకుల్లో జరుగుతున్న విక్రయాల ద్వారా ప్రతి నెలా వ్యాట్‌ రూపంలో యానాంకు రూ.5 కోట్ల ఆదాయం వస్తోందని అంచనా. వాస్తవానికి యానాం పరి«ధిలోని వినియోగదారులు కొనుగోలు చేసే పెట్రోలు, డీజిల్‌ 20 శాతం కూడా మించదని చెబుతున్నారు. దీనినిబట్టి ప్రతి నెలా పన్ను రూపంలో వస్తున్న రూ.5 కోట్ల ఆదాయంలో ఆ ప్రాంతం నుంచి వస్తున్నది రూ.కోటి మాత్రమే. దీనిని తీసివేయగా మిగిలిన 80 శాతం అమ్మకాలు అక్రమ వ్యాపారం ద్వారానే జరుగుతున్నట్టు అంచనా. తద్వారా మన జిల్లా ప్రతి నెలా రూ.4 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నట్టు లెక్కలు కడుతున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని యానాం సరి‘హద్దు’ దాటకుండా పెట్రో ఉత్పత్తులకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది.

తనిఖీలు చేస్తున్నాం
యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి పెట్రోలు, డీజిల్‌ను పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న 14 మందిని అరెస్టు చేసి ఐదు కేసులు నమోదు చేశాం. యానాం నుంచి పెట్రోలు, డీజిల్‌ అక్రమంగా తరలి రాకుండా యానాం చుట్టుపక్కల పకడ్బందీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. గట్టి నిఘా పెట్టి, తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి పెట్రోలు, డీజిల్‌ తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. 
– కరణం కుమార్, జిల్లా అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top