'నిమ్మగడ్డ'ను నియంత్రించండి

Petition of retired IG Sundar Kumar Das in AP High Court - Sakshi

ఆ పదవిలో ఆయన కొనసాగడానికి వీల్లేదు

ఏ అధికారంతో కమిషనర్‌గా కొనసాగుతున్నారో సంజాయిషీ అడగండి

హైకోర్టులో రిటైర్డ్‌ ఐజీ సుందర్‌కుమార్‌ దాస్‌ పిటిషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగకుండా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను నియంత్రించాలంటూ హైకోర్టులో మంగళవారం మరో పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నియామకం విషయంలో గవర్నర్‌దే విచక్షణాధికారమని.. ఈ విషయంలో రాష్ట్ర మంత్రిమండలికి ఎటువంటి అధికారం లేదంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కొనసాగడానికి వీల్లేదంటూ రిటైర్డ్‌ ఐజీ డాక్టర్‌ ఎ.సుందర్‌కుమార్‌ దాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అమలుచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. అందువల్ల ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించకుండా నిమ్మగడ్డ రమేశ్‌ను నియంత్రిస్తూ ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

నిమ్మగడ్డను సంజాయిషీ అడగండి
2016లో అప్పటి మంత్రి మండలి సిఫారసు మేరకు  నియమితులైన నిమ్మగడ్డ.. ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఏ అధికారంలో ఆ పదవిలో కొనసాగుతున్నారో సంజాయిషీ అడగాలని దాస్‌ తన కో–వారెంటో పిటిషన్‌లో హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల సంఘం కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అలాగే, నిమ్మగడ్డను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. అంతేకాక.. 2016లో నిమ్మగడ్డ రమేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీఓ 11ను కొట్టేయాలని కోరారు.

ఎస్‌ఈసీగా ముఖ్య కార్యదర్శి స్థాయికి తక్కువ కాని అధికారిని ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్‌ నియమించాలంటున్న ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌–200 (2)ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, దీనిని రద్దుచేయాలని  అభ్యర్థించారు. రాజ్యాంగంలోని అధికరణ 243కే(1) ప్రకారం.. ఎన్నికల కమిషనర్‌ నియామకం విషయంలో విచక్షణాధికారం గవర్నర్‌దేనని, రాష్ట్రం చేసే చట్టానికి లోబడి కమిషనర్‌గా నియామకం ఉండాల్సిన అవసరంలేదని వివరించారు. కానీ, ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 200 (2) మాత్రం.. మంత్రి మండలి సిఫారసు మేరకు ఎన్నికల కమిషనర్‌ నియామకం జరగాలని చెబుతోందని, దీని ప్రకారమే 2016లో అప్పటి మంత్రి మండలి సిఫారసు మేరకు నిమ్మగడ్డ రమేశ్‌ ఎన్నికల కమిషనర్‌ అయ్యారన్నారు. కానీ, ఎస్‌ఈసీ నియామకం పూర్తిగా గవర్నర్‌ విచక్షణపైనే ఆధారపడి ఉంటుందే తప్ప, మంత్రి మండలి సిఫారసు మేరకు కాదని హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ కొనసాగడానికి వీల్లేదని దాస్‌ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top