జగన్ చేసిందే కరెక్ట్ | peoples says ys jagan is Right... | Sakshi
Sakshi News home page

జగన్ చేసిందే కరెక్ట్

Oct 24 2015 2:17 AM | Updated on Mar 22 2019 6:18 PM

రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరంగా ఉండటమే సరైన నిర్ణయంగా ప్రజలు భావిస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.

సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరంగా ఉండటమే సరైన నిర్ణయంగా ప్రజలు భావిస్తున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. వైఎస్ జగన్ చేసింది నూరుశాతం కరెక్ట్ అని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. విజయదశమి నాడు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో జరిగిన రాజధాని భూమిపూజకు వైఎస్ జగన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

‘పేద రైతుల నుంచి భూములను బలవంతంగా సేకరించడం, ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగడం, మీకు నచ్చిన ప్రైవేటు విదేశీ కంపెనీలకు ఆ భూములను కట్టబెట్టడం, అందుకు విదేశీ కంపెనీల ద్వారా రూ.లక్షల కోట్లు తరలించడం, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పేరుతో సాగిస్తున్న అతి పెద్ద కుంభకోణానికి రాలేను’ అంటూ జగన్ ఈనెల 15న సీఎం బాబుకు బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. రూ.లక్షల కుంభకోణం క్రతువుకు రాలేను.. ఆహ్వానం పంపొ ద్దు..  పిలిచి రాలేదని అభాండాలు వేయొద్దంటూ స్పష్టం చేసిన జగన్ ఆ  కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

ఇప్పుడు జగన్ నిర్ణయమే సరైనదంటూ పార్టీలకతీతంగా ప్రజలంతా ఏకీభవిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు కార్యదర్శి తానేటి వనిత, ఉంగుటూరు, గోపాలపురం, దెందులూరు నియోజకవర్గ ఇన్‌చార్జిలు పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, కొఠారు రామచంద్రరావులు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

శంకుస్థాపన తతంగం తీరును చూసి,  ప్రధాని మోదీ ప్రసంగం విన్న ప్రజలు రాజధాని నిర్మాణం అధికార పార్టీలో కొందరు నేతలు బాగుపడే  లాభసాటి వ్యాపారంలా ఉంది తప్ప ప్రజా రాజధాని నిర్మాణంలా లేదని వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే శంకుస్థాపన అయిన తర్వాత, ప్రధాని వచ్చి వెళ్లిన తర్వాత ప్రజల్లో ఒక్కసారిగా వ్యతిరేకత పెల్లుబికిందని కొత్తపల్లి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement